-

‘అప్పు తీర్చలేకపోతే నీ కూతుళ్లను పంపించు’

4 Sep, 2018 11:06 IST|Sakshi

గురుగ్రామ్‌, హరియాణా : ‘వడ్డి వ్యాపారుల దౌర్జన్యాల నుంచి కాపాడండి అంటూ నా భర్త పోలీసులను ఆశ్రయించాడు. కానీ పోలీసులు నా భర్త ఫిర్యాదును పట్టించుకోలేదు. ఆ ఫలితం ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. అప్పు ఇచ్చిన వాళ్లు మా ఇంటికి మీదకు వచ్చి దాడి చేశారు. అప్పు తీర్చలేక పోతే నీ ఇద్దరు కూతుళ్లను మాతో పంపించు అంటే దూషించారు. ఈ అవమానం తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపిస్తుంది గురుగ్రామ్‌కి చెందిన మోని దేవి(33).

మోని దేవి తెలిపిన వివారాల ప్రకారం.. సురేందర్‌ సైనీ(36) ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం సైనీ అదే గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. కానీ వాటిని చెల్లించలేక పోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వారు సైనీ మీద ఒత్తిడి తీసుకురాసాగారు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారి వల్ల తన ప్రాణాలకు ప్రమాదాం ఉందని భావించిన సైనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు సరిగా స్పందించలేదు.

ఈ క్రమంలో ఓ రోజు అప్పు ఇచ్చినవారు సైనీ ఇంటికి వచ్చి అప్పు తీర్చమంటూ దూషించడమే కాక ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ బెదిరించారు. అంతేకాక అప్పు  చెల్లించలేక పోతే  సైనీ ఇద్దరు కుమార్తెలను వారి వెంట పంపిచాలంటూ అసహ్యంగా మాట్లాడరు. ఈ అవమానాన్ని భరించలేని సైనీ ఆత్మహత్య చేసుకుని మరణించాడు అని అతని భార్య మోని దేవి తెలిపింది. తన భర్త ఆత్మహత్యకు పోలీసులే కారణమని ఆరోపించింది. ఒక వేళ పోలీసులు గనక తన భర్త ఇచ్చిన ఫిర్యాదు గురించి పట్టించుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయింది. అయితే ఈ విషయం గురించి పోలీసులను అడగగా వారు సైని తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలపడం గమనార్హం.

మరిన్ని వార్తలు