బెళగావి కంటోన్మెంట్‌ సీఈఓ ఆత్మహత్య

26 Nov, 2023 07:47 IST|Sakshi

యశవంతపుర: బెళగావిలోని సైనిక స్థావరం.. కంటోన్మెంట్‌ (దండు మండలి) సీఈఓ కె.ఆనంద (40) అందులోని క్యాంప్‌ ప్రాంతంలోని నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. భారత రక్షణశాఖ ఆస్తుల సర్వీసు (ఐడీఈఎస్‌)కు చెందిన ఆనంద్‌ ఏడాదిన్నర కిందట కంటోన్మెంట్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తమిళనాడు వాసి, కుటుంబం చైన్నెలో ఉంటే, ఆయన ఇక్కడే ఒంటరిగా జీవిస్తున్నారు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తీయకుపోవటంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులను బద్ధలుగొట్టి పరిశీలించగా ఆనంద మృతదేహం కనిపించింది. ఆనంద రాసిన డెత్‌నోటును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌ పక్కన పురుగుల మందు డబ్బా పడి ఉంది.

అక్రమాల ఆరోపణలు, సీబీఐ సోదాలు
ఇటీవల కంటోన్మెంట్‌లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గురువారమే సీబీఐ అధికారులు కార్యాలయంలో దాడులు నిర్వహించారు. సీబీఐ సోదాల తరువాత మరుసటి రోజే ఆనంద ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. డెత్‌నోటులో ఏమి రాశారనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌ఎన్‌ సిద్ధరామప్ప, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆత్మహత్యకు కారణం తెలియదని అన్నారు. చైన్నెలోని ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌ ఉద్యో వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు