ప్రజల ప్రాణాలతో ‘పరీక్ష’

13 Jul, 2018 13:08 IST|Sakshi
యువకుడికి టెస్ట్‌ చేసిన పరికరం , హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్థారిస్తూ ఇచ్చిన రిపోర్టు

ప్రమాణాలు పాటించని రక్త పరీక్ష కేంద్రాలు

లేని రోగం ఉన్నట్లు రిపోర్టు

హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్థారించిన ఆర్‌ఎంపీ

ఆందోళనతో యువకుడి ఆత్మహత్యాయత్నం

రెండోసారి టెస్టుల్లో లేదని వెల్లడి

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): ప్రమాణాలు పాటించని రక్త పరీక్ష కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు రిపోర్టులు ఇస్తూ రోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ రిపోర్టులను గుడ్డిగా నమ్ముతున్న కొంత మంది వైద్యులు టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను పూర్తి అవగతం చేసుకోకుండానే రోగాలను నిర్థారించేస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే  మచిలీపట్నంలో గురువారం వెలుగుచూసింది. బిహార్‌కు చెందిన ఒక యువకుడు కొంత మంది స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం మచిలీపట్నం వచ్చాడు.

స్థానికంగా మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ నుంచి నలతగా ఉండటంతో 8న మచిలీపట్నం హైనీ హైస్కూలుకు సమీపంలో ఉన్న ఓ ఆర్‌ఎంపీ దగ్గరకు  వెళ్లాడు. దీంతో అతడు సద్దాంకు పలురకాల టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. డాక్టర్‌ చెప్పిన విధంగానే   ఆ యువకుడు ఆర్‌ఎంపీ వైద్యశాలలో ఉన్న ల్యాబ్‌లో రక్త నమూనాలను ఇచ్చాడు. మరుసటి రోజు ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఇచ్చిన రిపోర్టును వైద్యుడికి చూపించాడు. రిపోర్టు చూసిన వైద్యుడు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని పంపేశాడు.

మానసిక ఒత్తిడితో కెమికల్స్‌ తాగే యత్నం
 తనకు హెచ్‌ఐవీ ఉన్నట్లు వైద్యుడు నిర్థారించటంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. స్నేహితులకు దూరంగా ఉంటూ మదనపడుతూ ఉంటున్నాడు.  ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి మగ్గం పనులకు సంబంధించిన కెమికల్స్‌ కలుపుకుని తాగే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన స్నేహితులు అతడిని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. స్నేహితులు  జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి హెచ్‌ఐవీకి సంబంధించిన పరీక్షలు చేయించారు. అన్ని రిపోర్టులు నెగిటివ్‌గానే వచ్చాయి. దీంతో స్నేహితులు గురువారం ఆర్‌ఎంపీ వైద్యుడిని నిలదీశారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. దీంతో సదరు వైద్యుడు ల్యాబ్‌ టెక్నీషియన్‌ రిపోర్ట్‌ వల్లే  తప్పిదం జరిగిందని బుకాయించాడు. ఇలాంటి తప్పు మరోసారి చేయనంటూ ల్యాబ్‌ టెక్నీషయన్‌ బతిమిలాడడంతో స్నేహితులు శాంతించారు.

మరిన్ని వార్తలు