‘గాంధీ’కి పోదాం! | Sakshi
Sakshi News home page

‘గాంధీ’కి పోదాం!

Published Fri, Jul 13 2018 1:07 PM

Organ Transplant In Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది నిరుపేదలకు వైద్యారోగ్య శాఖ చల్లని కబురు అందించింది. ప్రతిష్ఠాత్మక గాంధీ జనరల్‌ ఆస్పత్రిని అవయవ మార్పిడి చికిత్సలకు కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.40 కోట్లతో ఆస్పత్రి ప్రధాన భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఆరు అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేయనుంది. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. ఇటీవల ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ... త్వరలో గుండె, కాలేయం, మూత్రపిండాలు, మోకాళ్ల మార్పిడి చికిత్సలనూ అందుబాటులోకి తీసుకురానుంది. ఇదంతా సవ్యంగా జరిగితే మరో నాలుగైదు నెలల్లో అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో గుండె, కాలేయ మార్పిడి చికిత్సలకు రూ.20లక్షలకు పైగా ఖర్చవుతుంటే... మూత్రపిండాల మార్పిడికి రూ.4లక్షల వరకు ఖర్చవుతోంది. గాంధీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తే... ఇక ఈ చికిత్సలన్నీ ఉచితంగా పొందొచ్చు.  

నోడల్‌ కేంద్రంగా ‘గాంధీ’...  
ఇప్పటి వరకు నిమ్స్‌ ఆస్పత్రిలో వెయ్యికి పైగా మూత్రపిండాల మార్పిడి చికిత్సలు, ఆరు గుండె మార్పిడి చికిత్సలు, ఏడు కాలేయ మార్పిడి చికిత్సలు జరిగాయి. ఆరోగ్యశ్రీ, ఇతర కార్డుల్లేని మధ్య తరగతి బాధితులకు ఈ చికిత్సలు భారమవుతున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయం, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో బాధితులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. లైవ్‌ డోనర్‌ చికిత్సలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుయాపాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ రెండు ఆస్పత్రుల్లోనూ కెడావర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. అవయవ మార్పిడి చికిత్సలు చేసేందుకు వైద్యులు రెడీగా ఉన్నప్పటికీ... మౌలిక సదుపాయాల లేమీ, ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూలు లేకపోవడంతో అనేక మంది బాధితులు చికిత్సలకు నోచుకోకుండా మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే నిమ్స్‌ జీవన్‌దాన్‌లో ఇప్పటికే 2,851 మంది కిడ్నీ మార్పిడి కోసం... 2,316 మంది కాలేయం మార్పిడి కోసం పేర్లు నమోదు చేసుకొని, ఆయా ఆస్పత్రుల్లో చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలకు భారీగా ఖర్చవుతుండడంతో.. ఆ మేరకు భరించే స్థోమత లేక చాలామంది మృత్యువాతపడుతున్న సంఘటనలు లేకపోలేదు. గాంధీ ఆస్పత్రిని అవయవ మార్పిడి చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ జరుగుతున్న చికిత్సలను జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో లైవ్‌లో వీక్షించే సదుపాయాలు కల్పించనున్నారు.  

అన్ని విభాగాలకు అనుగుణంగా...  
అత్యాధునిక క్యాజ్వల్టి, ఐసీయూ ఆధునికీకరణ, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో గాంధీ ఆస్పత్రికి రోగులు పోటెత్తుతున్నారు. 1,062 పడకల సామర్థ్యమున్న గాంధీ ఓపీకి రోజుకు సగటున మూడు వేలకు పైగా బాధితులు వస్తుంటారు. మరో 2,200 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్న చికిత్స కేంద్రాలకు భిన్నంగా, అన్ని విభాగాలు వాటిని ఉపయోగించుకునేలా నూతన ఆపరేషన్‌ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు గుండె మార్పిడి చికిత్స చేయాలనుకుంటే అందుకు సంబంధించిన వైద్య నిపుణులు, తర్ఫీదు పొందిన నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. అనంతరం వెంటనే కాలేయ మార్పిడి చికిత్స అదే కేంద్రంలో చేయాల్సి వస్తే ఆ విభాగానికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది తక్షణమే అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్న ఈ థియేటర్లకు బ్యాక్టీరియాను కూడా దరిచేరనీయరు. అంతేకాదు ఈ కేంద్రాల్లో పనిచేసే వైద్యులు మొదలుకొని వార్డుబాయ్‌ వరకు అనుభవం ఉన్న వారినే నియమించనున్నారు. గతంలో 65 పడకల ఐసీయూ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సిబ్బంది లేని కారణంగా సేవలందించేందుకు నెల రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడలాంటి అవకాశం ఇవ్వకుండా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సమయంలోనే అవసరమైన వైద్య సిబ్బంది నియమించనున్నట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement