హాస్టల్స్‌.. న్యూసెన్స్‌

23 Apr, 2019 06:45 IST|Sakshi

హాస్టళ్ల ముందు అర్ధరాత్రి అభ్యంతరకరంగా సంచరిస్తున్న జంటలు  

ప్రశ్నించిన స్థానికులపై యజమానుల ఎదురుదాడి

న్యూసెన్స్‌పై పోలీసు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు స్థానికుల ఫిర్యాదు

చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం

హిమాయత్‌నగర్‌:‘‘సర్‌.. ఇంత వరకు నేను ఏ పోలీసు స్టేషన్‌ మెట్లక్కలేదు. స్థానిక పోలీసులు స్పందించడం లేదు. కొంతమంది చేస్తున్న న్యూసెన్స్‌ను అరికట్టమని పాలీస్‌ బాస్‌గా మీ వద్దకు వచ్చాం. దయచేసి యాక్షన్‌ తీసుకోండి’’.

‘‘సర్‌.. మా ఇంటి పరిసరాల్లో పుట్టగొడుగుల్లా హాస్టల్స్‌ పుట్టుకొచ్చాయి. వాటిలో ఎన్ని హాస్టళ్లకు అనుమతులున్నాయో తెలియదు. వాళ్లు చేసే న్యూసెన్స్‌ వల్ల మేము పగలు రాత్రి నిద్రాహారాలు మానుకోవాల్సి వస్తోంది. దయచేసి చర్యలు తీసుకోండి’’.

మార్చి 25న ఒకే రోజు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ను కలిసిన హిమాయత్‌నగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదులివి.  యాక్షన్‌ తీసుకోవాలంటూ ఈ ఇద్దరు అధికారులు ఆదేశాలు జారీ చేసి దాదాపు నెల కావొస్తున్నా ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. పోలీసులు నామ్‌కే వాస్తేగా ఒక్కరోజు వచ్చి పది నిమిషాలు గస్తీ నిర్వహించి వెళ్లిపోయారు. ఇక జీహెచ్‌ఎంసీ సిబ్బంది అయితే ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

అర్దరాత్రి న్యూసెన్స్‌..
హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ సమీపంలోని, విఠల్‌వాడీ మసీదు వెనక గల్లీలో సుమారు పది వరకు హాస్టళ్లున్నాయి. వీటిలో రెండు మాత్రమే బాయ్స్‌ హాస్టల్స్‌. మిగలనవన్నీ గరŠల్స్‌ హాస్టల్స్‌. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ గల్లీలో అమ్మాయిలు, అబ్బాయిలతో సందడిగా ఉంటుంది. రాత్రి 11 గంటల తరువాత నుంచి అసలు రచ్చ మొదలవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు జంటలుగా హాస్టల్స్‌ బయట నిలబడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, పెద్దగా కేకలు వేయడం వంటివి షరా మామూలుగా మారాయి. ఇలాంటి చేష్టలను చూస్తూ బయటకు రావాలంటేనే సిగ్గుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్దరాత్రి సమయాల్లో సెల్ఫీలు దిగుతూ, అంతాక్ష్యరి, డ్యాన్సులు, బైక్‌ రైడ్స్‌తో న్యూసెన్స్‌ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.  

ప్రశ్నించిన వారిపై యజమానుల రుబాబు..
మార్చిలో జరిగిన హోలీ రోజు ఇవే హాస్టల్స్‌ వద్ద అర్దరాత్రి కొంతమంది యువకులు మందు బాటిళ్లతో వీరంగం సృష్టించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన స్థానికులపై ఆయా హాస్టళ్ల యాజమానులు ‘‘వాళ్లేదో హోలీ సంబురాలు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏమీ అనలేదు కదా..? మీ పని మీరు చూసుకోండి’’ అంటూ రుబాబ్‌గా మాట్లాడినట్టు స్థానికులు తెలిపారు. 

ఓ హాస్టల్‌ ముందు గుమికూడిన యువకులు
కమిషనర్లకు రాతపూర్వక ఫిర్యాదు..
ఈ వ్యవహారంపై పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌కు స్థానికులు దాదాపు నెలరోజుల క్రితం నేరుగా కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ పాలేపల్లి రమేష్‌ను చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో ఈ నెల 5న ఇన్‌స్పెక్టర్, అడ్మిన్‌ ఎస్‌ఐ.కర్ణాకర్‌రెడ్డితో కలసి గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో న్యూసెన్స్‌ ఏమీ లేకపోవడంతో వారు వెనుదిరిగారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ స్థానికంగా ఎన్ని హాస్టళ్లున్నాయి.? వాటిలో ఎంతమంది ఉంటున్నారు.? ఎన్ని హాస్టల్స్‌కు అనుమతులు ఉన్నాయి.? అనే విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.  

చర్యలు శూన్యం
ఈ న్యూసెన్స్‌ వ్యవహారంపై ఇటు పోలీసుల నుంచి కానీ.. అటు జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి కానీ ఏ మాత్రం స్పందన రాకపోవడం విచిత్రకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి కారణంగా ఈ హాస్టల్స్‌ నడుపుతున్న వ్యక్తుల వెనక బడా బడా రాజకీయ నాయకులు ఉన్నారని, ఫిర్యాదు చేసిన ప్రతిసారీ హాస్టల్‌ యజమానులు రాజకీయ నాయకులతో పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారని స్థానికులు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు