భార్య మృతితో గుండె పగిలిన భర్త

25 May, 2019 07:56 IST|Sakshi
బాలకిష్టమ్మ, పెంటయ్య (ఫైల్‌)

గంటల వ్యవధిలో దంపతుల మృతి

కందుకూరు మండలం చిప్పలపల్లిలో విషాదం

కందుకూరు: అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు. చావులోనూ ఒకరికొకరు తోడయ్యారు. భార్య మృతదేహం చూసి గుండెపగిలిన భర్త కుప్పకూలిపోయాడు. భార్య వెంటే పయనమయ్యాడు. ఈ ఘటన విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చిప్పల్లపల్లి గ్రామానికి చెందిన పోలమోని పెంటయ్య (55)కు బాలకిష్టమ్మ (45) రెండో భార్య. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమారై. కుమార్తె పుట్టిన తర్వాత ఆమె అనారోగ్యంతో మృతిచెందింది. ఆ తర్వాత ఆయనకు తోడుగా బాలకిష్టమ్మను 25 ఏళ్ల కిందట పెంటయ్య వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు కలిగారు. మొత్తం నలుగురు కుమారులు, ఒక కుమారైకు వీరు వివాహాలు చేశారు.

మొదట భార్య వెళ్లిపోయిన తర్వాత తనకు తోడుగా వచ్చిన బాలకిష్టమ్మ అంటే పెంటయ్యకు అమితమైన ప్రేమ. వీరిద్దరూ వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తుండేవారు. అయితే నాలుగు రోజుల కిందట భార్య బాలకిష్టమ్మ ఉపాధి కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యింది. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని భర్తకు తెలియజేయకుండా కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి తీసుకువచ్చారు. ఆ దృశ్యం చూసిన భర్త పెంటయ్య గుండె పగిలింది. తీవ్రంగా కలత చెంది అక్కడికక్కడే కుప్పుకూలాడు. కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట ఒకేసారి మృతిచెందడం గ్రామస్తులను కలచివేసింది. నేడు శనివారం వారిద్దరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

మరిన్ని వార్తలు