కల్కి ఆశ్రమాల్లో కొనసాగుతున్న తనిఖీలు

16 Oct, 2019 15:46 IST|Sakshi

సాక్షి, తిరుపతి :  కల్కి భగవాన్‌ ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. కల్కి భగవాన్‌ ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. కాగా దాడులు సమయంలో కల్కి భగవాన్‌, ఆయన సతీమణి పద్మావతి కానీ అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

మరోవైపు చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్‌  నిర్వహాకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇక కల్కి ఆశ్రమాల్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు.

కాగా గతంలో కూడా కల్కి భగవాన్‌ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి వారిని మత్తులో ఉండేలా చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయ్‌ కుమార్‌ నాయుడు అలియాస్‌ కల్కి భగవాన్‌ తొలినాళ్లలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. అది కాస్తా దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్‌ కుమార్‌ 1989లో చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. 

స్పెషల్‌ దర్శనానికి రూ.25వేలు
ఆ తర్వాత తన ఆశ్రమ కార్యాకలాపాలను ఏపీతో పాటు తమిళనాడుకు విస్తరించారు. కల‍్కి భగవాన్‌ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్‌ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక​ ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. ఇక కల్కి భగవాన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనతో పాటు కల్కి కుమారుడు కృష్ణాజీ కూడా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదుతో 2010లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే 2008లో చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొద్దిరోజులు ఆశ్రమం మూతపడింది.

చదవండి: ‘కల్కి భగవాన్‌’ పై ఐటీ దాడులు

మరిన్ని వార్తలు