గాలి జనార్దన రెడ్డి అరెస్టు

12 Nov, 2018 04:22 IST|Sakshi

పరప్పన జైలుకు తరలింపు

24 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ  

సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి యాంబిడంట్‌ కంపెనీ ముడుపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు శనివారం సాయంత్రమే జనార్దన రెడ్డి బెంగళూరులోని సీసీబీ (కేంద్ర నేర విభాగం) పోలీసు కార్యాలయానికి రావడం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు జనార్దన రెడ్డిని ప్రశ్నించామనీ, ఆదివారం ఉదయం కూడా విచారణను కొనసాగించి 9 గంటల సమయంలో అరెస్టు చేశామని అదనపు పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ చెప్పారు.

అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, 6వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా 24 వరకు జనార్దన రెడ్డికి జ్యుడీíషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయనను పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఐపీసీ సెక్షన్లు 120, 204, 420లకింద కేసులు నమోదు చేశారు. కాగా జనార్దన రెడ్డికి, యాంబిడంట్‌ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కాగా, ఇదే కేసులో పోలీసుల అదుపులో ఉన్న జనార్దన రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను ఆదివారం విడుదల చేశారు. అయితే తన యజమాని అరెస్టయినందున తాను కూడా జైలులోనే ఉంటానని అలీఖాన్‌ చెప్పడం గమనార్హం.

ఏమిటీ యాంబిడంట్‌ కేసు?
2016లో సయ్యద్‌ అహ్మద్‌ ఫరీద్‌ అనే బడా వ్యాపారి ఆధ్వర్యంలో యాంబిడంట్‌ పేరుతో గొలుసుకట్టు పెట్టుబడుల వ్యాపారం ప్రారంభమైంది. నాలుగు నెలలకే పెట్టుబడిపై 50 శాతం రాబడి ఉంటుందంటూ రూ. 600 కోట్లను రాబట్టి అనంతరం చేతులెత్తేసింది. ఈడీ, ఐటీ అధికారులు ఫరీద్‌పై కేసులు నమోదు చేశారు.  వీటి నుంచి బయటపడేస్తానంటూ జనార్దన రెడ్డి తన పీఏ ద్వారా ఫరీద్‌తో రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇందులో భాగంగా రూ.18 కోట్లను చెందిన బంగారం వ్యాపారి రమేష్‌ కొఠారి ఖాతాకు జమ చేశారని తేలింది. ఆ సొమ్ముతో 57 కిలోల బంగారం కొన్నారు. రమేష్‌ను విచారణ చేయగా అలీఖాన్‌కు బంగారం అందించినట్లు చెప్పాడు.

మరిన్ని వార్తలు