ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

23 May, 2019 07:09 IST|Sakshi

టీ.నగర్‌: చెన్నైలో ప్రియురాలి తండ్రిని కిడ్నాప్‌ చేసి హత్యా బెదిరింపులు చేసిన పెయింటర్‌ సహా ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సెక్రటేరియట్‌ కాలనీ పోలీసు మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి కార్యాలయ పని నిమిత్తం ఐనావరం పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి ఇద్దరు మహిళలు రోదిస్తూ వచ్చారు. వారిలో ఒకరు ఐనావరం పరశురామన్‌ వీధికి చెందిన ఆర్తి (20). ఇద్దరు మహిళలను ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి కూర్చోబెట్టి వివరాలు అడిగింది. ఆర్తి మాట్లాడుతూ తనకు ఐనావరం ఠాగూర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌ (25)తో 2013లో వివాహమైందని, తమకు జోష్వా (4) అనే కుమారుడున్నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం భర్తను విడిచి పుట్టింటికి వచ్చానని, ఆ సమయంలో పెరంబూరు రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన పెయింటర్‌ సుభాష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడిందని, అతనితో కొన్నేళ్లు జీవించినట్లు తెలిపారు. తర్వాత భర్త ప్రవీణ్‌ తనను మళ్లీ కాపురానికి తీసుకెళ్లాడని, అక్కడ మళ్లీ సమస్యలు ఏర్పడడంతో పుట్టింటికి వచ్చినట్లు తెలిపారు.

ఇదిలాఉండగా ఈనెల 19న తన తల్లికి ఒక ఫోన్‌కాల్‌ వచ్చిందని అందులో మాట్లాడిన సుభాష్‌ ఆర్తిని తనకు అప్పగించి మీ భర్తను తీసుకువెళ్లండని బెదిరించినట్లు పేర్కొన్నారు. తన తండ్రిని హతమారుస్తారనే భయంగా ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలావుండగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి బుధవారం మారువేషంలో వెళ్లి పెయింటర్‌ సుభాష్‌ను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు