పది నిమిషాల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టు

26 Apr, 2019 07:37 IST|Sakshi
బాధితులు

స్థానికుల సమాచారంలో లాలాగూడ పోలీసుల అలర్ట్‌

కార్‌ నెంబర్‌ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు

సమాచారం అందించిన వ్యక్తికి సన్మానం

అడ్డగుట్ట: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంలో  అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయిపై కక్ష కట్టారు. కిడ్నాప్‌ చేసి బెదిరించాలని చూశారు. అయితే వారి పాచిక పారలేదు. స్థానికుల సహకారంతో పోలీసులు పది నిమిషాల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించారు. సమాచారం అందించిన వ్యక్తిని సన్మానించి, కిడ్నాపర్లను రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. సిద్దిపేట జిల్లా పొన్నాల మండలం బత్తిరామన్నపల్లి గ్రామానికి  చెందిన శనిగరం శ్రీనివాస్‌(22), అదే గ్రామానికి చెందిన ఆవాల తితిక్ష(20)లు నాలుగు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ఇద్దరి కుటుంబసభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో  ఈ నెల 15న నగరంలోని బోయిన్‌పల్లి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకొని 16వ తేదీన సిద్దిపేట పోలిస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నూతన జంట సిద్దిపేట నుంచి హైద్రాబాద్‌కు వచ్చి లాలాపేటలో  నివాసముంటున్నారు.  నాలుగు రోజుల క్రితం వీరు లాలాపేటలో ఉంటున్నట్లు అమ్మాయి కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. అమ్మాయి  అన్న గోపి(22), అతని స్నేహితులు దశరథమ్‌(38), క్రాంతికుమార్‌(25)లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు.

బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్‌ తన చిన్నమ్మ కొడుకుతో కలిసి షాపునకు వెళ్లేందుకు బయటకు రాగా వెంటనే టీఎస్‌ 09ఈయూ 4365 అనే నంబర్‌ స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో వచ్చి శ్రీనివాస్‌ను కారులో బలవంతంగా ఎక్కించుకొని పరారయ్యారు. గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే శ్రీనివాస్‌ భార్య తితిక్షకు విషయం చెప్పాడు. ఆమె స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కారు నెంబర్‌ ఆధారంగా లాలాగూడ సీఐ శ్రీనివాస్‌ అన్ని చెక్‌ పాయింట్లను అలర్ట్‌ చేశారు. బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్విఫ్ట్‌ కారును అడ్డుకొని శ్రీనివాస్‌ను కాపాడారు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కేసును చేందించిన లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు. అదే విధంగా కారు నెంబర్, ఇతర సమాచారం ఇచ్చిన వ్యక్తికి పోలీసులు సన్మానించారు. అనంతరం, కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తుల్లో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు