వ్యాపారి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

వ్యాపారి దారుణ హత్య

Published Fri, Apr 26 2019 7:41 AM

Businessmen Murdered in Hyderabad - Sakshi

సనత్‌నగర్‌: ప్రముఖ వ్యాపారి ఎంఏ అజీజ్‌ హత్యకు గురయ్యారు. ఎర్రగడ్డ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన అజీజ్‌ హత్య దావనలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, హతుడి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఎర్రగడ్డకు చెందిన ఎంఏ అజీజ్‌ చిన్న కిరాణాషాపు నుంచి అంచలంచెలుగా ఎదిగి బడా వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయనకు ఆరుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు.   బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మజీద్‌లో ప్రార్థనలు నిర్వహించి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలోని లక్ష్మీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వద్దకు వెళ్ళాడు.

ఆయనను తన మనుమడు అద్‌నాత్‌ ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్ళి అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయాడు. అయితే సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో తన తండ్రి కనిపించడం లేదంటూ అజీజ్‌ రెండో కుమారుడు మహ్మద్‌ అబ్దుల్‌ రహీం సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం వరకు కూడా తన తండ్రి ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల సా యంతో కుటుంబసభ్యులు లక్ష్మీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వద్ద గల సీసీ కెమెరాలను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం 2.19 గంటలకు ఎంఏ అజీజ్‌ స్థానిక లక్ష్మి కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న రహమత్‌ టవర్స్‌లోకి వెళ్ళినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆయన ముందు ఇద్దరు యువకులు కూడా నడుచుకుంటూ వెళ్లారు. రహమత్‌ టవర్స్‌ వైపు వెళ్ళిన అజీజ్‌ గురువారం వరకు కూడా తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించలేదు.  పోలీసు సిబ్బంది , కుటుంబ సభ్యులు రహమత్‌ టవర్స్‌లో గాలించారు. సెల్లార్‌ చివరన ఉన్న గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. ఆ గది తాళం పగులగొట్టి చూడగా గదిలో అజీజ్‌ మృతదేహం కనిపించింది. ఒంటిపై రక్తపు మరకలు, గొంతుకు లుంగీతో చుట్టి ఉంది. హత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌యాదవ్, ఎంఐఎం నేత మహ్మద్‌ షరీఫ్‌ సంఘటనా స్థలానికి వచ్చి హంతకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement