కేటీపీఎస్‌ ఉద్యోగి హత్య

11 Mar, 2019 12:37 IST|Sakshi
మృతుడి ఇంటి వద్ద గుమిగూడిన స్థానికులు)

సాక్షి, పాల్వంచ: పాల్వంచలో కేటీపీఎస్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వేళ మెడపై కత్తితో దాడి చేయడంతో రక్తమడుగులో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కేటీపీఎస్‌ ఒఅండ్‌ఎం కర్మాగారంలోని ఐసీహెచ్‌పీలో పీఎగా విధులు నిర్వహిస్తున్న గుగ్గిళ్ళ వీరభద్రం(55) ఇంటర్మీడియట్‌ కాలనీలో క్వార్టర్‌ నంబర్‌ 60లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి షిఫ్ట్‌ విధులకు వెళ్లగా..  మద్యం సేవించి ఉన్నాడనే కారణంతో సెక్యూరిటీ అధికారులు అతడిని కేటీపీఎస్‌లోకి అనుమతించలేదు.

దీంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రి 3గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బాత్రూమ్‌కు వెళ్లిన వీరభద్రం ఒక్కసారిగా అరిచాడు. ఇంట్లో ఉన్న భార్య రమాదేవి, ఇద్దరు కొడుకులు రవితేజ, సంతోష్‌ వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. మెడపై కత్తితో నరికిన గాయం ఉంది. కుటుంబ సభ్యులు ఇంటి పక్కవారి సాయంతో మోటార్‌ సైకిల్‌పై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరభద్రం మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ మడత రమేష్, ఎస్‌ఐ ముత్యం రమేష్‌లు సందర్శించారు.

జాగిలాలను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. తన భర్తను ఎవరో నరికి చంపారని భార్య రమాదేవి తెలిపింది. ఈ విషయమై సీఐ మడత రమేష్‌ను వివరణ కోరగా.. రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. తన చిన్న కొడుకు సంతోష్‌ ప్రేమ వివాహం విషయంలో గొడవలు జరిగాయని, అమ్మాయి తరుపు బంధువుపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో కేసును చేధిస్తామని అన్నారు. ఇటీవల మృతుడు వీరభద్రం మెడికల్‌ అన్‌ఫిట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కేటీపీఎస్‌ అధికారులు రిజక్ట్‌ చేసినట్లు తెలిసింది. కాగా హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

వీరభద్రం మృతదేహం 

మరిన్ని వార్తలు