మానవ మృగానికి నాలుగుసార్లు మరణదండన

17 Feb, 2018 16:09 IST|Sakshi
కామాంధుడి క్రూరత్వానికి బలైన జైనాబ్‌ అమీన్‌(ఫైల్‌ ఫొటో)

లాహోర్‌, పాకిస్తాన్ : ఏడేళ్ల బాలికని పైశాచికంగా హింసించి, హత్య చేసి, చెత్త బుట్టలో పడేసిన కేసులో నిందితుడు ఇమ్రాన్‌ అలీకి శనివారం ఉరి శిక్ష పడింది. లాహోర్‌ కేంద్ర కారాగారంలో కేసును విచారించిన యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి అన్నెంపున్నెం ఎరుగని పసిపాపపై అమానుషానికి ఒడిగట్టినందుకు నాలుగు సార్లు మరణ దండనతో పాటు జీవిత ఖైదు, రూ. 32 లక్షల జరిమానా విధించారు.

హత్యానంతరం బాలిక దేహాన్ని చెత్తకుప్పలో పడేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల ఫైన్‌ వేశారు. ఇమ్రాన్‌పై కిడ్నాపింగ్‌, రేప్‌, హత్య, టెర్రరిజం సంబంధిత కార్యకలాపాల్లో సంబంధం తదితర ఆరోపణలు ఉన్నట్లు పాకిస్తాన్ జాతీయ పత్రిక డాన్‌ ప్రచురించింది. నిందితుడు చేసిన నేరాలను కోర్టులో ఒప్పుకున్నట్లు న్యాయవాది తెలిపారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు దోషికి 15 రోజులు సమయం ఉంటుందని వివరించారు.

ఏడేళ్ల జైనాబ్‌ అమీన్‌ను ఇమ్రాన్‌ అలీ జనవరి 4న కిడ్నాప్‌ చేశాడు. అనంతరం బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి క్రూరాతి క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటనతో పాకిస్తాన్‌లో ప్రజాగ్రహం పెల్లుబికింది. చిన్నారులను కూడా కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకెక్కారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణను సైతం వేగవంతంగా ముగించింది.

మరిన్ని వార్తలు