‘నిర్మల’కు ప్రాణ హాని?

4 Feb, 2019 12:17 IST|Sakshi
ఆస్పత్రి నుంచి జైలుకు వెళ్తున్న నిర్మలాదేవి

న్యాయవాది ఆరోపణ

అనారోగ్యంతో ఆస్పత్రికి తరలింపు

చికిత్స అనంతరం ఆగమేఘాలపై జైలుకు

సాక్షి, చెన్నై: ప్రొఫెసర్‌ నిర్మలా దేవికి జైలులో ప్రాణహాని ఉందని, ఆమె మరణంతో కేసును ముగించేందుకు వ్యూహరచన సాగిందని న్యాయవాది పసుం పొన్‌  పాండియన్‌ ఆరోపించారు. శనివారం రాత్రి నిర్మలా దేవి గుండెపోటు వచ్చినంత వేదనకు గురికావడంతో మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం మళ్లీ జైలుకు తరలించారు.

నలుగురు విద్యార్థినులను మాయమాటలతో తప్పుడు మార్గంలో పయనింప చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన అరుప్పు కోట్టై ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యవహారం గురించి తెలిసిందే. ఎవరి కోసమో ఆమె ఆ విద్యార్థుల్ని లొంగ దీసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆడియో స్పష్టంచేయడం దుమారం రేపింది. ఈ కేసులో నిర్మలా దేవితో పాటు మురుగన్, కరుప్పు స్వామిలను అరెస్టుచేశారు. వీరు పది నెలలుగా కటకటాలకే పరిమితమయ్యారు. కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొచ్చే సమయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ సీబీసీఐడీ వర్గాలు వీరిని హాజరుపరిచే వారు.

వీరికి ఇంతవరకు బెయిల్‌ కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో గత వారం విచారణ సమయంలో సీబీసీఐడీ భద్రతా వలయాన్ని ఛేదిస్తూ నిర్మలాదేవి మీడియా వద్దకు పరుగులు తీశారు. తాను ఏ తప్పు చేయలేదని, బలవంతంగా ఇరికిస్తున్నారని, సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెను మాట్లాడనివ్వకుండా మహిళా భద్రతా సిబ్బంది బలవంతంగా జైలుకు తరలించారు. అదే సమయంలో నిర్మలా దేవిని కేసులో బలవంతంగా ఇరికించిచారని, ఎవర్నో రక్షించే ప్రయత్నంలో ఆమెను బలి పశువు చేశారని, త్వరలో ఆధారాలు బయటపెడుతానంటూ న్యాయవాది పసుం పొన్‌ పాండియన్‌ ఆ సమయంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మలా దేవి హఠాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో అనుమానాలు బయలుదేరాయి.

ఆసుపత్రికి తరలింపు
కోర్టుకు వెళ్లొచ్చిన అనంతరం నిర్మలా దేవి అనారోగ్యం బారిన పడ్డట్టు సమాచారం. అయితే, ఆమెకు జైలు వర్గాలు ఎలాంటి చికిత్స అందించడం లేదన్న ఆరోపణలు కూడా బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి గుండె పోటు వచ్చినంతగా వేదన, శ్వాస ఆడకపోవడంతో నిర్మలా దేవి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీంతో ఆమెను రాత్రికి రాత్రే మదురై రాజాజీ ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులుఆమెకు కొన్ని రకాల మందుల్ని అందించారు. ఓపీ విభాగంలోనే చికిత్స అందించి ఆదివారం మధ్యాహ్నం మళ్లీ జైలుకు తరలించారు. అయితే, ఆమెకు ప్రాణ హాని ఉందని , జైలులోనే ఆమె మరణించే విధంగా వ్యూహరచన చేసినట్టు న్యాయవాది పసుం పొన్‌ పాండియన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఇప్పటికే పలుమార్లు కోర్టుకు వివరించి ఉన్నట్టు, అయితే, అందుకు తగ్గ వైద్య పరీక్షలు అందించడం లేదన్నారు. శని, ఆదివారం చోటు చేసుకున్న పరిస్థితిని బట్టి చూస్తే, ఆమె జైలులోనే మరణించే విధంగా ప్రయత్నాలు చేసి ఉన్నట్టుందని, ఈ కేసు వెనుక ఉన్న పెద్దల్ని రక్షించి, కేసును ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుందని ఆరోపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణించి తక్షణం బెయిల్‌ మంజూరుతోపాటు  ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో నిర్మలా దేవి జీవితం జైలులోనే ముగిసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు