ఆమె ప్రేమ యవ్వారం ఈమె ప్రాణాల మీదకు తెచ్చింది!

14 Apr, 2019 08:03 IST|Sakshi
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భవాని చంటి బిడ్డతో  భవాని భర్త గంగరాజు

మదనపల్లె టౌన్‌ : చిన్ననాటి స్నేహితురాలు అదృశ్యం ఓ అమాయక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అదృశ్యమైన అమ్మాయి కుటుంబ సభ్యుల వేధింపులు, సూటిపోటి మాటలకు ఆమె కుంగిపోయింది. వీరి నడుమ ఉంటే తనకే ముప్పు తప్పదని తన బిడ్డతో పాటు ఊరు వదిలి దూరాన ఉన్న పెదనాన్న ఇంటికి వచ్చినా వేధింపుల పర్వకం ఆగలేవు. దీంతో ఆమె ఉరేసుకుని బలవన్మరణం చెందింది. శుక్రవారం రాత్రి మదనపల్లెలో ఈ విషాద సంఘటనకు చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం..ములకలచెరవు మండలం పాళ్యంవారిపల్లెకు చెందిన గంగరాజు ఐదేళ్లక్రితం మదనపల్లె మండలం బొమ్మన చెరువుకు చెందిన  భవాని(22)ని వివాహం చేసుకున్నాడు. కారుడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవాని పినతల్లికి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఆమె తోడుగా ఉండేందుకు రెండు నెలల క్రితం పుట్టినిల్లు అయిన బొమ్మన చెరువుకు వచ్చింది. గ్రామంలో ఉన్న ఓ యువతి భవానికి చిన్ననాటి స్నేహితురాలు.

ఆమెకు కూడా వివాహమైంది. అయితే ఆ యువతి కట్టుకున్న భర్తను కాదని ఆదే గ్రామానికి చెందిన మరో యువకుని ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ ఇష్టపడి కొంతకాలం సహజీవనం సాగించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన భవాని స్నేహితురాలు తన ప్రియునితో కలసి పది రోజుల క్రితం అదృశ్యమైంది. దీనికి భవానీయే కారణమంటూ ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెను వేధించసాగారు. అంతుచూస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన భవాని తన పిన తండ్రి ఉంటున్న స్థానిక అనపగుట్టకు చేరుకుని తలదాచుకుంది. అయిననూ అక్కడికి వచ్చి సైతం వారు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైంది. ఇక చావే శరణ్యమని భావించిన భవాని మరణాన్ని ఆశ్రయించింది. సూసైడ్‌ నోట రాసి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందడంతో టుటౌన్‌ ఎస్‌ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామ నిర్వహించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులపై హత్యకేసు నమోదు చేయాలి
ప్రియుని మోజులో పడి వెళ్లిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఏ పాపం తెలియని తన భార్య బలవన్మరణానికి కారణమయ్యారని భవాని భర్త విలపించారు. వారిపై హత్యకేసు నమోదు చేయాలని గంగరాజుతో పాటు మృతురాలి బంధువులు డిమాండ్‌ చేశారు. శనివారం ఉదయం టూటౌన్‌ స్టేషన్‌కు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. మృతురాలికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్‌ ఉన్నాడు.

మరిన్ని వార్తలు