పెంపుడు కుక్కను కొట్టాడని.. 

28 May, 2019 08:36 IST|Sakshi
బాధితుడు సుబ్రహ్మణ్యం, నిందితుడు శ్రీనివాస్‌

కత్తితో యువకుడిపై దాడి

బంజారాహిల్స్‌: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కను కొట్టాడన్న కోపంతో ఓ కొబ్బరిబోండాల వ్యాపారి ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట సమీపంలోని మారుతీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ ఫిలింనగర్‌ రోడ్‌ నెంబర్‌–16లో కొబ్బరి బోండాలు విక్రయించేవాడు. అతడికి సంతానం లేకపోవడంతో ఓ వీధి కుక్కను చేరదీసి ‘సాయి’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజూ తనతో పాటు దుకాణానికి తీసుకొచ్చేవాడు. ఆదివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన చల్లా బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడు శ్రీనివాస్‌ కొబ్బరి బోండాల బండి పక్క నుంచి వెళుతుండగా కుక్క అతడి వెంటపడటంతో రాయితో కొట్టాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్‌ చేతిలో ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడి సోదరుడు చల్లా రాజ్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తన పెంపుడు కుక్కపై అకారణంగా రాయితో దాడి చేసినందుకే తాను తిరిగి దాడి చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు.  
 

మరిన్ని వార్తలు