అమెరికాలో ఉద్యోగాలంటూ మోసం..

26 Jan, 2020 12:55 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో :  అమెరికాలోని హోటల్స్‌లోని రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓలెక్స్‌లో ప్రకటనలు ఇచ్చి అమ్మాయిలను మోసగిస్తున్న వ్యక్తిని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ ఫేస్‌–1లో ఉంటున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బుర్ర దినేశ్‌కుమార్‌ అమెరికాతో పాటు వివిధ దేశాల్లోని ప్రముఖ హోటల్స్‌లో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రకటలు ఇచ్చాడు. ఈ ప్రకటనకు స్పందించిన ఆశోక్‌నగర్‌కు చెందిన బాధితురాలిని సత్య అనే పేరుతో దినేశ్‌ ఫోన్‌లో మాట్లాడాడు. పాస్‌పోర్టు, ఆధార్‌ పంపాలని చెప్పడంతో పంపింది. ఆ తర్వాత దినేశ్‌కుమార్‌ పేరుతో కాల్‌ చేసి వీసా, టికెట్‌ ప్రాసెసింగ్, ఇతర వాటి కోసం డబ్బులు ఖర్చు అవుతాయంటూ బాధితురాలి నుంచి రూ.1,97,000ల తన బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఎంతకీ ఆ తర్వాత ఫోన్‌కాల్‌కు స్పందించకపోవడంతో బాధితురాలు నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు గతేడాది డిసెంబర్‌ 13న ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బుర్ర దినేశ్‌కుమార్‌ను శనివారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు