పీడీజేకు ఫోన్‌ చేసి దొరికిపోయిన నిందితుడి సోదరుడు

28 Aug, 2019 12:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : కడప జిల్లా ప్రధాన జడ్జిని బురిడీ కొట్టించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీనంటూ ఓ నిందితుడి సోదరుడు పీడీజేకి ఫోన్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పీడీజే వాస్తవాలు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. కడప జిల్లాలోని రాజంపేట కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన సుమిత్రా నాయక్‌ ఇటీవల ఓ మహిళ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుని బద్వేలు కోర్టు జడ్జి రాజశేఖర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమెకు ఓ అఫిడవిట్‌ ఇచ్చాడు. ఈ సంతకం ఫోర్జరీ అని తేలడంతో రాజశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమిత్రా నాయక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా ఇటీవల‍ వైఎస్సార్‌ జిల్లా ప్రధాన జడ్జికి ఓ నెంబర్‌(9642118188) నుంచి ఫోన్‌ చేసి.. తాను హైకోర్టు ఏసీజే జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ పీఎస్‌ పి.రవీంద్రన్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ అయిన సుమిత్రా నాయక్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏసీజే చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలని  చెప్పాడు.  దీంతో పీడీజే స్వయంగా ఏసీజే పేషీకి ఫోన్‌ చేసి, పేషీలో రవీంద్రన్‌ పేరుతో ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరన్న విషయం తెలుసుకున్న పీడీజే ఈ విషయాన్ని నేరుగా ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని పీడీజేను ఏసీజే ఆదేశించారు. దీంతో పీడీజే ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సుమిత్రా నాయక్‌ సోదరుడే రవీంద్రన్‌ పేరుతో ఫోన్‌ చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు