వధువు బావే వరుడికి అశ్లీల చిత్రాలు..

9 Jul, 2018 06:24 IST|Sakshi

వధువు సొంత బావే వరుడికి అశ్లీల చిత్రాలు పంపాడు

వన్నెచింతలపూడిలో ఘటన

నిందితుడు టీడీపీ నాయకుడు

కేసు మాఫీకి పోలీసులపై ఆ పార్టీ నేతల ఒత్తిళ్లు

తూర్పుగోదావరి ,అమలాపురం రూరల్‌:  అతడి భార్య ఉపాధి కోసం కువైట్‌ వెళ్లింది. ఇంతలో అతడి మరదలి వివాహం కుదిరింది. శనివారం రాత్రి ఆమె వివాహం. పెళ్లికి  అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతలో తనకీ వివాహం వద్దంటూ వరుడు అభ్యంతరం తెలిపాడు. తాను చేసుకోబోయే వధువు ఎవరితోనో కలిసి ఉన్న అశ్లీల దృశ్యాలతో కూడిన వీడియో... ఫొటోలు తన ఫోన్‌కు వచ్చాయని, అందుకే ఈ వివాహం తనకిష్టం లేదంటూ  తెగేసి చెప్పాడు. దీంతో పీటల వరకూ వచ్చిన వివాహం ఆగిపోయింది. అసలేం జరిగిందని విచారిస్తే ఆ వధువు సొంత బావే ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి వరుడికి పంపించి వివాహం జరగకుండా అడ్డుకున్నాడని తేలింది. దీంతో గ్రామ పెద్దల్లో తగవులు... పోలీసులకు ఫిర్యాదులు వంటి తతంగాలు శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ చకచకా జరిగిపోయాయి. అమలాపురం రూరల్‌ మండలం వన్నె చింతలపూడిలో ఈ ఘటన జరిగింది. పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబీకులంతా విషాదంలో ఉన్నారు.

మరదలిపై కన్నేసి..
సొంత బావే మరదలిపై కన్నేసి ఆమె వివాహం జరగకుండా చేశాడు. ఆమె కూడా తనకు సొంతం కావాలన్న స్వార్థంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వన్నె చింతలపూడి గ్రామ పెద్దల, పోలీసుల విచారణతో తేలింది. ఆమె బావ సొంతూరు అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి. గ్రామంలో అతడు టీడీపీ నాయకుడు. పైగా ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్‌ కావడంతో సునాయసంగా తన మరదలి మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు సృష్టించి వరుడి ఫోన్‌కు పంపించాడు. తమ చిన్న కుమార్తె వివాహం ఆగిపోయేలా చేసిన అల్లుడిపై వధువు తండ్రి ఆదివారం ఉదయం అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు టీడీపీ నాయకుడు కావడంతో ఈ కేసును మాఫీ చేసేందుకు కొందరు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోలీసులపై ఒత్తిడి తేసాగారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కనీసం మీడియాకు సమాచారం ఇచ్చేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.

అసలేం జరిగింది...?
ఆ తెలుగుదేశం నాయకుడు మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలతో పాటు కొన్ని సంభాషణలను కూడా మెసేజ్‌ ద్వారాతన మరదలికి కాబోయే వరుడికి పంపించాడు. చివరకు ఆమె స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా తీసిన వీడియోను కూడా వరుడికి వెళ్లేలా చేశాడు. వరుడు కూడా వివాహ ముహూర్తం రోజైన శనివారం వరకూ విషయాన్ని బయట పెట్టలేదు. శనివారం రాత్రి వధువు కుటుంబీకులు, బంధువులు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ వరుడు ‘నేనీ పెళ్లి చేసుకోను’ అంటూ తనకు వచ్చిన వధువు ఫొటోలు, వీడియోలు చూపించాడు. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఇంటి అల్లుడు, వధువు బావే ఇవన్నీ చేశాడని తేలడంతో తగాదా గ్రామపెద్దల నుంచి పోలీసు స్టేషన్‌కు వచ్చింది. అయితే  టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఇంకా ఆదివారం సాయంత్రం వరకూ అతడిపై కేసు నమోదు కాలేదు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా