వేధింపులు తాళలేకే..

12 Feb, 2019 09:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, చిత్రంలో నిందితులు

యువకుడి హత్య కేసులో మీడిన మిస్టరీ  

రాంగోపాల్‌పేట్‌: రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్య కేసులో మిస్టరీ వీడింది. డబ్బు కోసం తమను వేధించడమేగాక గతంలో దాడి చేసినందుకు కోపం పెంచుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌బాబు, ఎస్‌ఐ దేవ సురేష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన సత్యనారాయణ, అదే జిల్లాకు చెందిన పాముల శ్రీనివాసరావు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి మినిష్టర్‌రోడ్‌లోని ఫుట్‌పాత్‌పై ఉంటూ ఫంక్షన్‌ హాళ్లలో పనిచేసుకునేవారు. వీరికి అదే ప్రాంతంలో ఉంటున్న  రాహుల్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

రాహుల్‌ (25) తరచూ సత్యనారాయణ, శ్రీనివాసరావులను డబ్బు కోసం వేధించే వాడు. డబ్బులు ఇవ్వలేదని గత నవంబర్‌లో డబ్బు  సత్యనారాయణపై దాడి చేయడంతో అతను తీవ్రం గాయపడ్డాడు. గత కొద్ది రోజులుగా శ్రీనివాసరావుకు అక్కడే ఉంటూ ఫంక్షన్‌హాళ్లలో  పనిచేసే యువతితో పరిచయం ఏర్పడింది. సదరు యువతిని తనతో సన్నిహితంగా ఉండాలని రాహుల్‌ ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. ఆ సదరు యువతి కారణంగానే శ్రీనివాసరావు తనకు దూరంగా ఉంటున్నాడని కోపం పెంచుకున్న రాహుల్‌ తరచూ అతనితో గొడవపడేవాడు. దీంతో సత్యనారాయణ, శ్రీనివాసరావు రాహుల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుని అదను కోసం ఎదురు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న రాహుల్‌ సర్జికల్‌ స్పిరిట్‌ తాగి అగ్రవంశీ భవనం ఎదుట పడి ఉండటాన్ని గుర్తించిన శ్రీనివాసరావు, సత్యనారాయణ అతడి తలపై రాయితో మోది హత్య చేశారు.  స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు