బాలిక అపహరణ..సామూహిక లైంగిక దాడి

24 Sep, 2019 07:51 IST|Sakshi

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

చిత్తూరు ,పుంగనూరు : పేద దళిత కుటుంబానికి చెందిన ఓ బాలికను ముగ్గురు యువకులు అపహరించారు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డారు. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా.. మండలంలోని జట్టిగుండ్లపల్లెకు చెందిన ఓ దళిత బాలిక పదో తరగతి చదివి ఆపి వేసింది. చండ్రమాకులపల్లె గ్రామానికి చెందిన శ్రీహరి, రాజు బాలిక చిన్నాన్న కుమారులు. ఈ నెల 10న మధ్యాహ్నం అరుణ్‌తో కలసి కారులో జెట్టిగుండ్లపల్లె గ్రామానికి వచ్చారు.

మార్గం మధ్యలో బాలిక తల్లికి, తాతకు ఫోన్‌చేసి ఆమె ఎక్కడుందన్న విషయం తెలుసుకున్నారు. నేరుగా బాలిక ఇంటికి వెళ్లి బాలికను కారులో బలవంతంగా గ్రామ పొలిమేర్లలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప డ్డారు. వెంటనే ఇంటికి వచ్చిన బాలిక విషయం చెప్పకుండా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తాత, కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను కాపాడారు. వెంటనే కర్ణాటక కోలారులోని ఆసుపత్రికి బాలికను తరలించారు. అప్పటి నుంచి ఆ బాలిక ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ విషయం సోమవారం బయటపడింది. ఫిర్యాదు అందుకున్న సీఐ మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి, తాత వాంగ్మూలం మేరకు నిందితులపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ మాట్లాడుతూ, లైంగిక దాడి ఘటనపై పూర్తి వివరాలు బాధితురాలు తెలపాల్సి ఉందన్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకోవడానికి బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా