కూతురు వయసు బాలికపై కుతంత్రం

10 Oct, 2018 13:03 IST|Sakshi

మూడున్నరేళ్ల పాపపై బెంగళూరులో ఘోరం  

కామాంధుడు చంద్రబాబుకు దేహశుద్ధి  

కర్ణాటక, బనశంకరి: అభం, శుభం ఎరుగని కూతురు వయసు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నీచుడిని ప్రజలు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బెంగళూరు మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... తమిళనాడుకు చెందిన చంద్రబాబు (52) అనే వ్యక్తి మారతహళ్లి సమీపంలోని దేవరబీసనహళ్లి వద్ద గల షెడ్‌లో నివాసముంటున్నాడు. ఇతను వెల్డింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడి షెడ్‌ పక్కనే కూలీ దంపతులు నివాసముంటుండగా వీరికి మూడన్నర ఏళ్లు వయసు గల చిన్నారి ఉంది. దంపతులు ఇద్దరూ ఇళ్లలో పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు.

బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి  
సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చిన్నారిని ఇంట్లో వదిలిపెట్టి దంపతులు ఇద్దరూ ఇంటిపనులకు వెళ్లారు.  ఈ సమయంలో షెడ్‌ పక్కనే ఉంటున్న చంద్రబాబు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చంద్రబాబు ఇంట్లో నుంచి చిన్నారి  ఏడుస్తూ వస్తుండటాన్ని గమనించిన స్థానికులు బాలికను ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని  వివరించింది. స్థానికులు కోపం పట్టలేక కీచకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. మారతహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కామాంధుడు చంద్రబాబును అరెస్ట్‌ చేసి  బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చంద్రబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా వీరు తమిళనాడులో ఉంటున్నారు. అతని అఘాయిత్యాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు