మహిళా కౌన్సిలర్‌పై హత్యాయత్నం

14 Jan, 2020 09:13 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

రెడ్‌హ్యేండడ్‌గా పట్టుకున్న గ్రామీణులు

నలుగురు యువకులకు దేహశుద్ధి

తిరువలంగాడు సమీపంలో అర్ధరాత్రి కలకలం

తిరుత్తణి: అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్‌పై హత్యాయత్నానికి యత్నించిన నలుగురు యువకులను చితకబాది తిరువలంగాడు పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రి కలకలం రేపింది. తిరుత్తణి తాలూకాలోని తిరువలంగాడు మండల అన్నాడీఎంకే కౌన్సిలర్‌గా జీవా వివజయరాఘవన్‌ విజయం సాధించారు. యూనియన్‌  చైర్మన్‌ పదవికి ఆమె పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 11న యూనియన్‌ చైర్మన్‌ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో గ్రూపు రాజకీయాల కారణంగా చైర్మన్‌ ఎన్నికలకు కౌన్సిలర్లు దూరమయ్యారు.చైర్మన్‌ ఎంపికకు సంబంధించి రహస్య ఓటింగ్‌ను అధికారులు రద్దు చేశారు.

ఆదివారం రాత్రి జీవా విజయరాఘవన్‌ స్వగ్రామం కుప్పంకండ్రిగ వద్ద ఉన్న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి నలుగురు యువకులు మారణాయుధాలతో గ్రామంలో ప్రవేశించి జీవా విజయరాఘవన్‌ను  హతమార్చేందుకు యత్నించారు. స్థానికులు గుర్తించి వారిని రెడ్‌ హ్యేండడ్‌గా పట్టుకుని కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై యువకులకు దేహశుద్ధి చేసి తిరువలంగాడు పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందుతులది తిరువళ్లూరు పరిసర గ్రామాలకు చెందిన అబ్దుల్‌ రజాద్‌(19), అయ్యప్పన్‌(21), కుమార్‌(17), విష్ణు(19) గా గుర్తించారు. వారి వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు.

జీవా విజయరాఘవన్‌ ఎవరు?
అన్నాడీఎంకే తిరువళ్లూరు జిల్లా ఎంజీఆర్‌ విభాగం కన్వీనర్, అరక్కోణం మాజీ ఎంపీ హరి స్వయాన అన్న తమిళ భాష అభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయరాఘవన్‌ భార్య జీవా విజయరాఘవన్‌. తిరువలంగాడు మండలంలోని 12వ వార్డు యూనియన్‌ కౌన్సిలర్‌గా అన్నాడీఎంకే నుంచి పోటీ చేసి గెలుపొందారు. చైర్మన్‌ పదవికి  యత్నిస్తున్నారు. అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు చైర్మన్‌ పదవికి పోటీ చేస్తున్న క్రమంలో 11న నిర్వహించిన చైర్మన్‌ ఎన్నికలకు అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు పాల్గొనకపోవడంతో ఎన్నికలు రద్దు చేశారు. ఈ క్రమంలో జీవా విజయరాఘవన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు