బాలుడి దారుణ హత్య

15 May, 2018 13:22 IST|Sakshi
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

విలపిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు

సారవకోట : తండ్రి మీద కోపంతో అభంశుభం తెలియని బాలుడిని కిరాతకంగా హత్యచేశారు. ఆడుకుంటున్న చిన్నారిని మాయమాటలు చెప్పి తోటలోకి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేశారు. వారికి తీరని గర్భశోకాన్ని మిగిల్చారు. ఈ విషాదకర సంఘటన మండలంలోని గుమ్మపాడులో సోమవారం జరిగింది. 

పక్కా వ్యూహంతోనేనా?

గ్రామానికి చెందిన కత్తిరి వెంకటరమణ, నాగమ్మ ద్వితీయ కుమారుడు హర్షవర్ధన్‌ (8).. అదే గ్రామానికి చెందిన కత్తిరి లక్ష్మీనారాయణ మామిడి తోటలో హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్తుడు కత్తిరి ఎండన్నకు ఆయన భార్యతో కొంత కాలం నుంచి తగాదాలు ఉన్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో తగాదాలు పరిష్కరించే సమయంలో సర్పంచ్‌ ప్రతినిధి వెంకటరమణ.. తన భార్యకు ఎక్కువ సహకరిస్తున్నాడని భావించిన ఎండన్న ఆయనపై కక్ష పెంచుకున్నాడు.

వెంకటరమణకు బంధువు అయిన తేజేశ్వరరావు(17) ఇంటర్‌ చదువుతున్నాడు. సెల్‌ఫోన్‌ తగాదా విషయంలో అతడికి వ్యతిరేకంగా రమణ మాట్లాడారు. అలాగే ఇటీవల ఒక గిరిజన కుటుంబానికి, తేజేశ్వరరావుకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలోనూ గిరిజన కుటుంబానికే వెంకటరమణ మద్దతు పలికారు. దీంతో తేజేశ్వరరావు కూడా వెంకటరమణపై కక్ష పెంచుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న హర్షవర్ధన్‌ను తేజేశ్వరరావు.. మామిడి తోటలోకి తీసుకెళ్లి కత్తిరి ఎండన్నతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పథకం ప్రకారం బాలుడిని వెల్లకిల్లా పడుకోబెట్టి రెండు చేతులు విరిచి తలను భూమిని ఆనించి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఉదయం 9 గంటలలోపు ఇది జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాతపట్నం సీఐ బీవీవీ ప్రకాశ్‌ శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పాతపట్నం పోలీస్‌ స్టేషన్‌కు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్య అనంతరం తేజేశ్వరరావు గుమ్మపాడు నుంచి నరసన్నపేట వెళ్లే బస్సు ఎక్కి ఆ బస్సులో దుస్తులు మార్చుకున్నట్లు కొంతమంది స్థానిక విద్యార్థులు చెబుతున్నారు.

హర్షవర్ధన్‌ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. హర్షవర్ధన్‌ గుమ్మపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. చిన్నారికి అన్నయ్య జయవర్దన్‌ ఉన్నాడు. విశాఖపట్నంలో చదువుతున్నాడు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైన కత్తిరి వెంకటరమణ.. తన కుమారుడు హత్య అయ్యాడని తెలియడంతో హతాశుడయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. గుమ్మపాడులో విషాద చాయలు అలముకున్నాయి. 

మరిన్ని వార్తలు