నిర్లక్ష్య‘భటులు’..!

15 Jul, 2019 08:54 IST|Sakshi

విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వరుస దొంగతనాలు 

మొన్న 120 కాసుల బంగారం మాయం 

నిన్న ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై దాడి 

టాస్క్‌ఫోర్సు పోలీసులు  దాడులు చేస్తేనే కేసులు నమోదు

సాక్షి, అమరావతి బ్యూరో : కొద్ది రోజుల కిందట విజయవాడ, కుమ్మరి వీధిలోని ఓ ఇంట్లో 120 కాసులకు పైగా బంగారాన్ని దొంగలు కాజేశారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా శనివారం రాత్రి  ఇస్లాంపేటలోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ముగ్గురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలోనే నిత్యం రద్దీగా ఉండే పంజా సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. ఈ రెండు ఘటనలు విజయవాడ కమిషనరేట్‌లోని కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. నిఘా వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్న ఆరోపణలు వస్తుండగా.. ఈ స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డే లేదన్న వాదనా బలంగా వినిపిస్తోంది. 

 విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. స్టేషన్‌ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమంగా గుట్కా, కోడి పందెలు, క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాట శిబిరాలను నిర్వహిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నా పోలీసులు దాడులు చేసిన సందర్భాలు కనిపించవు. కేవలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి చేసి ఆ స్టేషన్‌లో అప్పగిస్తేనే కేసులు నమోదు చేసే పరిస్థితి. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యహరిస్తున్న అక్కడి సిబ్బంది, అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

కొరవడిన నిఘా..
కొత్తపేట స్టేషన్‌ పరిధిలో ఓ సీఐతో పాటు నలుగురు ఎస్‌ఐలు బా«ధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు సీనియర్‌ కాగా మిగిలిన ముగ్గురు ఎస్‌ఐలు కొత్తగా వచ్చిన వారు. దీంతో కొత్త వారందరూ స్టేషన్‌లోని కేసుల విచారణకే పరిమితం అవుతున్నారు. వాస్తవానికి ఎస్‌ఐలందరికీ స్టేషన్‌ని ప్రాంతాల వారీగా విభజించి పరిధులు కేటాయించారు. కేసుల విరాచణతో పాటు ఎస్‌ఐలు వారికి కేటాయించిన పరిధిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. కానీ ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి లేని వైనం. మరో వైపున స్టేషన్‌ పరిధిలో ఆకతాయిలు, మద్యం బాబుల గోడవలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. అసలు నిందితులను వదిలేసి ఫిర్యాదీదారులని వేధింపులకు గురిచేస్తున్న సందర్భాలున్నాయి.

దాడులన్నీ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందివే..
స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన పేకాట, అక్రమ మద్యం విక్రయదారులపై జరిగిన దాడులన్ని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఖాతాలోకే చేరుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల కాలంలో కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కల్తీ నెయ్యి, కోడి పందెలు, పేకాట శిబిరాలు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై స్టేషన్‌ అధికారులు సరైన నిఘా పెట్టకపోవడంతో వాళ్లు యథావిధిగా తమ కార్యకలపాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

అంతా తానైన ‘షాడో సీఐ’!
కాగా, స్టేషన్‌లో షాడో సీఐగా పేరుగాంచిన ఓ ఎస్‌ఐ స్టేషన్‌ పరిధిలోని అక్రమార్కుల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు స్టేషన్‌లో ప్రచారం జరుగుతుంది. తనకు అడ్డుగా ఉన్నారనే కారణంగా కొంత మంది సిబ్బందిని తన పలుకుబడి ఉపయోగించి ఇతర స్టేషన్‌లకు బదిలీ చేయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు