బెయిల్‌ కోసం నకిలీ డాక్యుమెంట్లు..

17 Jun, 2020 07:57 IST|Sakshi

నైజీరియన్‌ మహిళ అరెస్టు   

సాక్షి, సిటీబ్యూరో: మ్యాట్రిమోనీ మోసం కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసేందుకు ష్యూరిటీ సంతకం చేసి నకిలీ డాక్యుమెంట్లను సమర్పించిన మహిళా నైజీరియన్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా డాక్టర్‌ను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షలు కొట్టేసిన కేసులో ఈ ఏడాది మార్చి నెలలో నైజీరియన్‌ గిడ్డి ఇసాక్‌ ఓలూతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే జైలులో ఇతడికి బెయిల్‌ ఇచ్చేందుకు సమ్మతించిన న్యాయస్థానం ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాలని ఆదేశించింది. దీంతో ఒబినా బాతోలోమివూ గొడ్విన్, రొస్‌లైన్‌ అన్నా ఎక్యూరేలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు వెళ్లి పాస్‌పోర్టు కాపీలు, రెంటల్‌ అగ్రిమెంట్‌ తదితరాలు సమర్పించారు. అయితే వీరిలో ఒకరైన న్యూఢిల్లీలో ఉంటున్న రొస్‌లైన్‌ అన్నా ఎక్యూరే 2016 ఫిబ్రవరి 10న మెడికల్‌ వీసాపై భారత్‌కు వచ్చానని పోలీసులకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తే అనుమానం వచ్చి సంబంధిత అదికారులకు పంపిస్తే వీసా ఫోర్జరీది అని తేల్చి చెప్పారు. దీంతో ఇటు పోలీసులు, అటు కోర్టును మోసం చేసి తమ వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేసేందుకు యత్నించిన రొస్‌లైన్‌ అన్నా ఎక్యూరేను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు