వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు...

30 Oct, 2023 11:15 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రబ్బరు స్టాంపుల కుంభకోణం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. సిట్‌ దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలను పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే మూడు డాక్యుమెంట్లు...ఆరు రబ్బరు స్టాంపుల చందంగా విరాజిల్లింది. ఈ దందా అంతా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ అండదండలతోనే ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో వేళ్లూనుకుపోయింది.

దామచర్ల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణానికి రింగ్‌ లీడర్‌గా అవతారమెత్తాడు. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, దామచర్ల ప్రధాన అనుచరురాలు పెరంమూరు వరలక్ష్మి అలియాస్‌ పెద్దిశెట్టి వరలక్ష్మికి 2012లో స్టాంప్‌ వెండర్‌ లైసెన్స్‌ను ఇప్పించాడు. అప్పటి నుంచే ఆమె దస్తావేజులను కేవలం నకిలీ డాక్యుమెంట్ల తయారీకి విక్రయిస్తూ ఈ రాకెట్‌కు తెరతీసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దామచర్ల తన అనుచరులను శాఖకు బదిలీ చేయించుకోవడంతో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణానికి అడ్డే లేకుండా పోయింది.

నకిలీల చేతిలో 1100 దస్తావేజులు
జిల్లా కోర్టు ప్రాంగణానికి సమీపంలో దస్తావేజులు విక్రయించేందుకు వరలక్ష్మికి ఒక దుకాణం కూడా ఏర్పాటు చేయించి దాన్ని దామచర్ల ప్రారంభించాడు. అప్పటి నుంచి దస్తావేజులను నకిలీ దందాలు చేసే ముఠాలకు మాత్రమే విక్రయిస్తూ భారీగా ఆర్జించింది. నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపుల కుంభకోణం వెలుగు చూడటంతో ఎస్పీ మలికాగర్గ్‌ సిట్‌ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్‌ బృందం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో స్టాంప్‌ వెండర్‌ వరలక్ష్మి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆమె నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారికి, సంతకాలు ఫోర్జరీ చేసే వాళ్లకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంది. సిట్‌ దర్యాప్తులో ఇప్పటి వరకు దాదాపు 1100 దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేలింది.

వరలక్ష్మికి పార్టీ పదవులెన్నో...
నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో అంగన్‌వాడీ విభాగం అసోసియేషన్‌కు కార్యదర్శి పదవిని కూడా ఇప్పించాడు. ఆ తరువాత ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్‌ పార్టీ అభ్యర్థిగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు నలుగురిని కాదని వరలక్ష్మికి టిక్కెట్‌ ఇప్పించాడు. టిక్కెట్‌ ఇప్పించటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా దామచర్లే పెట్టుకున్నాడన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే దామచర్ల ఆమెను ఎంతగా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు.

ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని..
సిట్‌ దర్యాప్తులో టీడీపీ నాయకుల పాత్రలు వెలుగుచూస్తుడడంతో అధికార పార్టీపై నెపం వేసేందుకు దామచర్ల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకున్నారు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఈ దర్యాప్తును కోరిందే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దోషులు ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎంఓలో ఉన్న కీలక అధికారులను సైతం ఆయన కోరిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి ఎల్లో మీడియా ప్రతి రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తోంది.

రూ.100 దస్తావేజు రూ.10 వేలకు విక్రయం...
ఒంగోలు కేంద్రంగా దస్తావేజులు అక్రమ విక్రయాలకు పెద్దిశెట్టి వరలక్ష్మి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా రూ.100 విలువైన దస్తావేజును అదే ధరకు అమ్మాలి. అయితే ఒక్కో చోట స్టాంపు వెండర్లు రూ.100 విలువ చేసే దస్తావేజుకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసుకుంటారు. ఈ విషయం రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే వరలక్ష్మి మాత్రం రూ.100 దస్తావేజును రూ.10 వేలకు విక్రయించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంది. దానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యేగా దామచర్ల అండదండలే.

టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే..
నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్‌ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్‌, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ సురేష్‌ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.

వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు...
దస్తావేజుల కుంభకోణంలో వరలక్ష్మి పాత్ర వెలుగుచూడడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజాపానగాలరోడ్డులో నివాసం ఉంటే వరలక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్పీ మలికాగర్గ్‌ నేతృత్వంలోని సిట్‌ బృందం ఆమె కదలికలపై నిఘా పెట్టింది. అయితే టీడీపీలోని ప్రధాన నాయకులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొని కాపాడుతున్నట్లు సమాచారం. సెల్‌ఫోన్లు, ఫోన్‌ నంబర్లు మారుస్తూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మితో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వారి కదలికలపై కూడా సిట్‌ నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం.

వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు కోర్టుల్లో కేసుల రూపంలో కొనసాగుతున్నట్లు కూడా సిట్‌ బృందానికి సమాచారం వచ్చింది. అనేక సమస్యలకు, ఆస్తులు వివాదాల్లోకి వెళ్లటానికి కూడా వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు ప్రధానంగా ఉన్నటు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డుల పరిశీలనలో 1100 దస్తావేజులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో దస్తావేజులను అక్రమార్కులకు విక్రయించినట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు