మళ్లీ సీబీసీఐడీ కస్టడీకి నిర్మలాదేవి

25 Apr, 2018 08:06 IST|Sakshi

టీ.నగర్‌: మరో ఆరుగురు విద్యార్థినుల ఫిర్యాదుతో నిర్మలాదేవిని సీబీసీఐడీ కస్డడీలోకి తీసుకుని విచారించనున్నారు. విరుదునగర్‌ జిల్లా, అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్‌ కళాశాల ప్రొఫెసర్‌ నిర్మలాదేవి విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మదురై సెంట్రల్‌ జైలు నిర్బంధంలో ఉన్న ఆమెను సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజుల కస్టడీలో విచారణ జరుపుతూ వచ్చారు. సోమవారంతో నాలుగు రోజుల విచారణ పూర్తికాగా, నిర్మలాదేవి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు.

దీంతో సీబీసీఐడీ పోలీసులు నిరాశకు గురయ్యారు. ఆమె విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. మరో ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. సీబీసీఐడీ విచారణ దారి మళ్లించే విధంగా ఉన్నట్లు కామరాజర్‌ వర్సిటీ ప్రొఫెసర్లలో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.  సీబీసీఐడీ పోలీసులు విచారణ సక్రమంగా నిర్వహించలేదని వారు ఆరోపిస్తున్నారు.

రూ.30లక్షలు మోసపోయిన నిర్మలాదేవి: ప్రొఫెసర్‌ నిర్మలాదేవి తన కుమార్తెకు మెడికల్‌ సీటు పొందేందుకు రూ.30లక్షలు నగదు అందజేసి మోసపోయినట్లు విచారణలో తేలింది. ఈ నగదును ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో విద్యార్థినులను ఎరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది.

కెమెరా ఫుటేజీల పరిశీలన: నిర్మలాదేవి కేసు వ్యవహారంలో కామరాజర్‌ వర్సిటీ కెమెరా ఫుటేజీలను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఇలా ఉండగా పోలీసులు మరో ఇద్దరు ప్రొఫెసర్ల వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. మదురై కామరాజర్‌ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మురుగన్‌ వద్ద సోమవారం విచారణ జరిపారు.

మరిన్ని వార్తలు