బెయిల్‌పై ఇలా.. కస్టడీకి అలా..!

3 Jan, 2020 04:37 IST|Sakshi

నౌహీరా షేక్‌ జైలు నుంచి విడుదల, అరెస్టు

మహారాష్ట్రకు తరలించిన అక్కడి పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నౌహీరా షేక్‌ చంచల్‌గూడ జైలు నుంచి గురువారం ఇలా బయటకు వచ్చి... అలా అరెస్టయ్యారు. ఈమెపై ఇక్కడ నమోదైన కేసుల్లో హైకోర్టు గత వారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో బయటకు వచ్చిన ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఆ రాష్ట్రంలో నౌహీరాపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్‌ను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు 2018 అక్టోబర్‌ 16న అరెస్టు చేశారు. ఆపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో వరుస అరెస్టులు చోటు చేసుకున్నాయి.

మహారాష్ట్ర, బెంగళూరుల్లోని జైళ్లకు వెళ్లి వచ్చిన నౌహీరా చంచల్‌గూడలోని మహిళా జైలుకు చేరారు. ఈమెపై నమోదైన కేసుల్ని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి (ఎస్‌ఎఫ్‌ఐఏ) బదిలీ చేసిన హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెలాఖరి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదల కావడానికి రూ.5 కోట్లు డిపాజిట్‌ చేయాలని, రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఈ నిబంధనలను పూర్తి చేసిన నౌహీరా షేక్‌ గురువారం విడుదలయ్యారు.

ఆమెకు తెలంగాణలో బెయిల్‌ మంజూరైన విషయం తెలుసుకున్న ముంబై ఎకనమికల్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) పోలీసులు పీటీ వారంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో అక్కడకు తరలించారు. అక్కడి కోర్టులో శుక్రవారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, మహారాష్ట్ర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు