పాచిపోయిన పదార్థాలు.. పురుగుల బిర్యానీ!

4 Jul, 2018 13:29 IST|Sakshi
పాచిపోయిన చికెన్‌, అన్నం

హోటళ్ల యజమానుల నిర్వాకం

జిల్లాకేంద్రంలోని పలు హోటళ్లలో అధికారుల తనిఖీ

భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి..

బార్‌ అండ్‌ రెస్టారెంట్లలోనూ ఇదే తంతు

పురుగులు తీసేసి తినండంటూ ఓ హోటల్‌ యజమాని బుకాయింపు

నల్లగొండ టూటౌన్‌ : ఘుమఘుమ వాసన ... ఆహా ఏమి రుచి .. చికెన్‌ లెగ్‌ పీస్‌ సూపర్‌ ... చికెన్‌ 65 యమ రుచి అంటూ తింటున్న భోజన ప్రియులు.. ఆయా  హోటళ్లలో జరుగుతున్న తతంగం చూస్తే కంగు తినాల్సిందే. వేడి, వేడి వంటకాలు, హైదరాబాద్‌ బిర్యానీ, దమ్, స్పెషల్‌ బిర్యానీలని చెబుతూ జనం చెవిలో పూలు పెడుతున్నారు జిల్లాకేంద్రంలోని పలు హోటళ్ల నిర్వాహకులు.

ఎంచక్కా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ జనాన్ని అనారోగ్యం పాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, పురుగుల బిర్యానీ, మూడు, నాలుగు రోజుల కిందట మిగిలిపోయిన ఆహార పదార్థాలు వడ్డిస్తున్న వైనం బయట పడింది. నల్లగొండలోని పలు హోటళ్లలో మున్సిపల్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేయడంతో నిర్ఘాంత పోయే ఉదంతాలు వెలుగు చూశాయి. హోటళ్లలో వండి వడ్డిస్తున్న ఆహార పదార్థాలను చూసి మున్సిపల్‌ అధికారులు సైతం కంగుతిన్నారు. 

బావర్చిలో పాచిపోయిన పదార్థాలు !

నల్లగొండ పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఉన్న బావర్చి హోటల్‌లో ఆహారపదార్థాలు అన్నీ పాచి పోయి, కుళ్లిపోయినవే ఉన్నాయి. మూడు, నాలు గు రోజులుగా మిగిలిపోయిన చికెన్‌ కూర, తిన్న తరువాత మిగిలిన వాటిని   సైతం ఓ గిన్నెలో వేసి పెట్టారు. మున్సిపల్‌ అధికారులు తనిఖీ చేసిన అన్ని ఆహార పదార్థాలు కుళ్లిపోయినవే ఉన్నాయి.

హైదరాబాద్‌ రోడ్డులోని ప్రసాద్‌ ఉడిపి హోటల్‌లో సైతం పాచిపోయిన కూరలే పెడుతున్నారు. ఎంతో పేరున్న హోటల్‌లో కూడా మిగిలిపోయిన వాటిని మరుసటి రోజు వినియోగదారులకు పెట్టి సొమ్ము చేసుకుంటుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రెస్టారెంట్లలోనూ ఇదే తంతు

జిల్లా కేంద్రంలోని హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హోటళ్లతో పాటు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లలోనూ పాచిపోయిన ఆహార పదార్థాలే పెడుతున్నట్లు తెలిసింది. మందు ప్రియులు కొద్దిగా మత్తులోకి జారుకోగానే పాచిపోయిన చికెన్‌ కూరలు, లెగ్‌ పీస్‌లు, ఆ తరువాత బిర్యానీలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆయా రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పడవేయకుండా దాచి పెట్టి వాటినే మరుసటి రోజు వేడి చేసి పెడుతున్న సమయంలో కొంత మంది వినియోగదారులు గుర్తించి హోటల్‌ యజమానులతో ఘర్షణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. 

పురుగులుంటే తీసేసి తినండి..

పురుగులు ఉంటే తీసేసి తినండి ... ఇంట్లో వస్తే ఏం చేస్తాం, ఇక్కడా అంతే అంటూ  ఓ హోటల్‌ యజమాని బుకాయించడంతో  వినియోగదారునికి సదరు యజమానితో ఘర్షణ చోటు చేసుకుంది. నల్లగొండలోని మేళ్లదుప్పలపల్లి స్టేజీ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో ఓ కుటుంబం పూరీలు తింటుండగా పప్పుకూరలో పురుగులు వచ్చాయి. దీంతో సదరు వినియోగదారుడు పురుగుల విషయంపై హోటల్‌ యజమానిని నిలదీయడంతో అతడు ఎదురుదాడికి దిగాడు. పురుగుల వస్తుంటాయి..అవసరమైతే తీసేసి తినండి అనడంతో వినియోగదారుడు అసహనంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు.

తనిఖీలు కరువు

హోటళ్లలో ఆహార పదార్థాలపై తనిఖీలు కరువయ్యాయి. సాధారణంగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు మున్సిపాలిటీనుంచి శానిటేషన్‌ విభాగం వారు తనిఖీలు చేయాలి. కానీ రెండు చోట్ల సిబ్బంది లేరు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఇతర కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ ఒక్కడే తిరుగుతుంటారు. దానికే ఆయనకు సమయం సరిపోతుంది. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ శానిటేషన్‌ విభాగంలో నలుగురు ఉండాల్సి ఉంది. కానీ ఇద్దరే ఉన్నారు.  

మరిన్ని వార్తలు