పోలీసులు వేధిస్తున్నారని.. 

9 Jan, 2020 03:21 IST|Sakshi

గాజు ముక్కలు మింగిన పాత నేరస్తుడు 

మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఘటన 

సాక్షి, మిర్యాలగూడ: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు గాజు ముక్కలు మింగాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే గాజుముక్కలు మింగినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సట్టు నాగేశ్వర్‌రావు గతంలో ఓ దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన చోరీ కేసులో అతడిని అనుమానితుడిగా గుర్తించిన వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం పోలీస్‌స్టేషన్‌ మరుగుదొడ్డికి వెళ్లిన అతను అందులోని విద్యుత్‌ బల్బును వెంట తెచ్చుకున్నాడు. సెల్‌లోకి వెళ్లి ముక్కలుగా చేసి మింగాడు. దీంతో అతనిని స్థానిక ఏరియా ఆస్పత్రికి.. పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించారు.  తనను దొంగతనం కేసులో 13 రోజుల క్రితం తీసుకొచ్చారని, అప్పటినుంచి తీవ్రంగా హింసిస్తున్నారని నాగేశ్వర్‌రావు ఆరోపించాడు. తన కాళ్లు పనిచేయడం లేదని, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకనే గాజు బల్బును పగులగొట్టి మింగానని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు