తగ్గిన నష్టాలు

9 Jan, 2020 03:16 IST|Sakshi

భారీ నష్టాల నుంచి రికవరీ అయిన మార్కెట్‌ 

52 పాయింట్ల నష్టంతో 40,818 వద్ద ముగింపు 

28 పాయింట్ల నష్టంతో 12,025కు నిఫ్టీ

ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడిచేయడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ ముందస్తు అంచనాలు బలహీనంగా ఉండటంతో మన స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టపోయింది. ఒక దశలో దాదాపు 392 పాయింట్ల మేర క్షీణించిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 52 పాయింట్ల నష్టంతో 40,818 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 123 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 28 పాయింట్లు తగ్గి 12,025 పాయింట్ల వద్దకు చేరింది. ట్రేడింగ్‌లో ఒక దశలో 20 పైసలు పతనమైన రూపాయితో డాలర్‌ మారకం విలువ చివరకు 12 పైసలు లాభంతో ముగిసింది. సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడుల కారణంగా ముడి చమురు ధరలు ఒక దశలో 4 శాతం ఎగిసినా.. ఆ తర్వాత 0.62 శాతం  మాత్రమే లాభపడ్డాయి.

ఇక కొన్ని బ్యాంక్, ఆర్థిక రంగ, టెక్నాలజీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో నష్టాలు తగ్గాయి.  పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడగానే కంపెనీల క్యూ3 ఫలితాలు, బడ్జెట్‌లపై మార్కెట్‌ దృష్టి సారిస్తుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ ఆరి్థక సంవత్సరం జీడీపీ 5 శాతంలోపే(ఇది పదికొండేళ్ల కనిష్ట స్థాయి) నమోదయ్యే అవకాశాలున్నాయంటూ కేంద్ర గణాంకాల సంఘం ముందస్తు అంచనాలను వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆసియా మార్కెట్లు నష్టాల్లో,  యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

>
మరిన్ని వార్తలు