కీచక ఉపాధ్యాయుడ్ని తొలగించండి

10 Oct, 2017 07:30 IST|Sakshi
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న తల్లిదండ్రులు

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

లైంగికదాడులకు పాల్పడుతున్నాడని డీటీకి ఫిర్యాదు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , విడవలూరు:  పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికదాడులకు పాల్పడుతున్న వావిళ్ల మెయిన్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన కీచక ఉపాధ్యాయుడు జగన్‌మోహన్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని తల్లిదండ్రులు కోరారు. సోమవారం వారు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ప్రమీలకు   వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసభ్యకరమైన పనులు తల్లిదండ్రులకు చెప్పవద్దని పిల్లలను బెదిరంచడంతో పాటు డబ్బులు ఆశ చూపుతున్నారని తెలిపారు.

విద్యార్థులను కఠినంగా శిక్షిస్తుండడంతో పాఠశాలకు వెళ్లేందుకు హడలిపోతున్నారని వాపోయారు. ఆరు నెలలుగా దాడులు జరుగుతున్నా పిల్లలు తమకు చెప్పలేదని ఆవేదన చెందారు. ప్రవర్తన మితిమీరడంతో భరించలేక పిల్లలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.  స్పందించిన డిప్యూటీ తహసీల్దార్‌ ప్రమీల విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లారు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు