‘పరిటాల కుటుంబసభ్యులే సూత్రధారులు’

18 Dec, 2018 15:17 IST|Sakshi
గంగుల భానుమతి

అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులని మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. సూరి హత్య కేసు తీర్పు అనంతరం గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత కుటుంబీకులపై విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. భాను కిరణ్‌ ఓ కాంట్రాక్టు కిల్లర్‌ అని, పరిటాల సునీత కుటుంబం భానుకిరణ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించే వాళ్లమని చెప్పారు. భానుకిరణ్‌ విశ్వాసఘాతకుడని పేర్కొన్నారు. సూరి పేరు చెప్పి భానుకిరణ్‌ కోట్ల రూపాయల సెటిల్‌మెంట్లు చేశారని వ్యాఖ్యానించారు.

2011 జనవరి 4న హైదరాబాద్‌లో గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. సూరికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్న భానుకిరణ్‌యే ఈ హత్యకు పాల్పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చున్న సూరిపై వెనక సీటులో కూర్చున్న భానుకిరణ్‌ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పరారై మధ్యప్రదేశ్‌లో తలదాచుకున్నాడు. 2012, ఏప్రిల్లో భానుకిరణ్‌ అనూహ్యంగా జహీరాబాద్‌లో పోలీసులకు పట్టుబట్టాడు. సుదీర్ఘ విచారణ తర్వాత భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టులో తీర్పు వెలువడింది.

మరిన్ని వార్తలు