ఒక్క ఫోన్‌కాల్‌.. రూ.42 లక్షలు మాయం

13 Feb, 2018 09:08 IST|Sakshi

ఏఎస్పీ రాధికకు బాధితుల ఫిర్యాదు

చిత్తూరు అర్బన్‌: ఒక్క ఫోన్‌కాల్‌.. ఇద్దరి వద్ద ఉన్న రూ.42 లక్షల్ని మాయం చేసింది. ఎవరు, ఏమిటని ఆలోచించకుండా సెల్‌ఫోన్‌కు వచ్చే కాల్స్‌కు, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షలు మోసపోయినట్లు గుర్తిం చారు. బాధితులు సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌డేకు ఏఎస్పీ రాధికను కలిసి గోడు వెల్లబోసుకున్నారు.
గంగాధరనెల్లూరు మండలం ఎల్లమరాజులపల్లెకు చెంది న లోకనాథరెడ్డి భారత సైన్యంలో జేసీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల ఆయనకు ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. తాము ఢిల్లీలోని కోకా–కోలా శీతల పానీయం కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నారు. జిల్లాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఏజెన్సీ ఇస్తామని నమ్మబలి కారు. తొలుత కాస్త అనుమానించినా ఫోన్‌లో అవతలివారి మాటలను బట్టి నమ్మేశాడు. ఇలా ఏజెన్సీ కోసం దశలవారీగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.33,56,361 డిపాజిట్‌ చేశాడు.

అయినా ఇంకా కొంత డిపాజిట్‌ చేయాలని చెప్పడంతో లోకనాథరెడ్డి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసే శారు. ఏంచేయాలో తెలియని బాధితుడు ఏఎస్పీని కలిసి తన బాధను విన్నవించుకున్నాడు. చిత్తూరు నగరం ఎస్టేట్‌ రోడ్డులో ఉన్న రఘురామ్‌నగర్‌ కాలనీకి చెందిన అరుణకుమారి సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో శ్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇటీవల నిర్వహించిన లక్కీడిప్‌లో రూ.1.50 కోట్ల విలువైన బహుమతి గెలుచుకున్నారని, మెయిల్, ఫోన్, చిరుమానా చెప్పాలని ఉంది. ఆమె వివరాలు ఇచ్చింది. తర్వాత ఓ బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చి ఇందులో తాము చెప్పినంత నగదు డిపాజిట్‌ చేయాలని అవతలి వ్యక్తులు పేర్కొన్నారు. అరుణకుమారి తన ఖాతా నుంచి పలుమార్లు రూ.8.58 లక్షలు ఆ కంపెనీ చెప్పిన ఖాతాలోకి వేసింది. తీరా తాను మోసపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ రెండు ఘటనల్ని సైబర్‌ క్రైమ్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏఎస్పీ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు