నల్లకుంట చోరీకేసులో నిందితుల అరెస్టు

26 Jul, 2019 18:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నల్లకుంటలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీపీ అంజన్‌ కుమార్‌ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 53 తులాల బంగారం, 5.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 24 లక్షలు ఉంటుందని అంజన్‌ కుమార్‌ వెల్లడించారు. వివరాలు.. నల్లకుట పరిధిలో నివాసం ఉంటున్న పిల్లి వినయ కుమారి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు కూతురు వరస అయ్యే కుష్బూ నాయుడు అలియాస్‌ నక్కీ మారు తాళాలతో చోరీకి పాల్పడింది. పిన్ని వినయ కుమారికి నిమ్మ రసంలో నిద్ర మాత్రలు కలిసి ఇచ్చిన కుష్భూ అనంతరం తన ప్రియుడుతో పాటు అతడి స్నేహితుడి సాయంతో బంగారు నగలు, నగదుతో ఉడాయించింది.

టెక్నాలజీని ఉపయోగించి బాధితురాలి కుటుంబ సభ్యుల కాల్‌ డేటా ఆధారంగా కేసును చేధించినట్లు తెలిపారు. నిందితులు అప్పటికే దొంగిలించిన సొత్తును అమ్మేయడానికి సిద్ధపడినట్లు, వీరిని బేగంపేట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే త్వరగా చేధించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత సంవత్సరం నుంచి డయల్‌ 100 ద్వారా ప్రజలకు నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఏ1 నిందితురాలిగా కుష్బూ నాయుడు, ఏ2 నిందితులుగా సుమల వంశీకృష్ణ, ఏ3 నిందితులు సూర్యగా పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు