నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

6 Sep, 2019 15:45 IST|Sakshi
చేతి వేళ్లకు ఇలా ఆపరేషన్‌ చేస్తున్న వైనం

గుట్టురట్టు చేసిన పాలకొల్లు పోలీసులు

సాక్షి, పశ్చిమ గోదావరి : ఆపరేషన్‌ ద్వారా వేలిముద్రలను మార్చుతూ.. నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి అక్రమంగా వ్యక్తులను విదేశాలకు పంపుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు వ్యక్తులతో పాటు నకిలీ పాస్‌పోర్టులు, సర్జికల్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా రాంబాబు 2010లో కువైట్‌ వెళ్లాడు. అక్కడ అక్రమంగా స్పిరిట్‌ తయారు చేస్తూ పట్టుబడడంతో 2015లో అతడిని ఇండియాకు పంపారు. కువైట్‌లో ఉండగా శ్రీలంక దేశానికి చెందిన జాకీర్‌ హుస్సేన్, అక్బర్‌ ఆలీ, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ బాషా, ఖాదర్‌ బాషా, ముజుఫర్‌ పరిచయం అయ్యారు. వీరి ద్వారా రాంబాబు ఇంటివద్దే తన పది వేళ్లకు ఆపరేషన్‌ చేయించుకుని వేలిముద్రలు మార్పించుకున్నాడు. భీమవరానికి చెందిన మేరీ రాజ్యలక్ష్మి, భగ్గేశ్వరం గ్రామానికి చెందిన పీఎంపీ వీరా త్రిమూర్తులుతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి దొంగ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసే నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కొండెం రాజారెడ్డి పరిచయం అయ్యాడు. వీరంతా కలసి జార్ఖండ్, బిహార్, తమిళనాడు, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, ఢిల్లీ, రాజంపేట తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 70 మంది వ్యక్తులకు వేలిముద్రల మార్పిడి చేశారు. నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి వీరిలో కొందరిని అక్రమంగా విదేశాలకు పంపారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ సొమ్ములు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. కీలక నిందితులు బొక్కా రాంబాబు, కొండెం రాజారెడ్డి, ముజుఫర్, పీఎంపీ వీరా త్రిమూర్తులు, శ్రీలంకకు చెందిన మహ్మద్‌ జాకీర్‌ హుస్సేన్‌ అలియాస్‌ మహ్మద్‌ ఫరూక్‌లను పాలకొల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు