కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో రాకేశ్‌, శిఖా

2 Feb, 2019 16:05 IST|Sakshi

కంచికచర్ల (కృష్ణా జిల్లా): ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జయరామ్‌ మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె చెల్లెలు మనీషా, రాకేశ్‌ రెడ్డిలను కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఎస్పీ బోస్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఏంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జయరాం భార్య పద్మశ్రీతో ఫోన్‌లో పోలీసులు మాట్లాడారు. (జయరామ్‌తోఉన్నదెవరు?)

జయరాం ఒంటిపై తీవ్రమైన గాయాలు లేకపోవడంతో ఆయనకు సైనైడ్ ఇచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పరీక్ష కోసం విశ్రా శాంపిల్‌ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. జయరాంకు అనేక వివాదాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని తీసుకున్నామని పోలీసులు తెలిపారు. టోల్‌గేట్‌ వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా జయరామ్‌ పక్కన మరో వ్యక్తి ఉన్నట్టు తేలిందన్నారు. ఈ కేసులో టీడీపీ ఎంపీ తమ్ముడి కుమారుడి హస్తం ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అతడిని కూడా విచారించాలని భావిస్తున్నారు.

జయరామ్‌ చనిపోయిన తర్వాత రాకేశ్‌తో కలిసి శిఖా ఆయన ఇంటి వెళ్లి కీలక పత్రాల కోసం గంటసేపు గాలించినట్టు తేలింది. బెడ్‌రూం తాళాలు ఇచ్చేందుకు నిరాకరించిన జయరామ్‌ వ్యక్తిగత సిబ్బందిపై వీరిద్దరూ దాడి చేసినట్టు సమాచారం. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జయరామ్‌ ఇంట్లోకి చొరబడినట్టు తెలుస్తోంది. (జయరామ్‌ హత్యకేసులో కొత్త కోణం)

కాగా, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న జయరామ్‌ కుటుంబీకులు ఇంకా హైదరాబాద్‌ చేరుకోకపోవడంతో అంత్యక్రియలు ఆలస్యంకానున్నాయి. మంచు తుఫాన్‌ కారణంగా అమెరికాలో విమాన సేవలు నిలిచిపోవడంతో జయరామ్‌ కుటుంబీకుల రాక ఆలస్యం కానుంది.

మరిన్ని వార్తలు