చోరీ కేసులో భార్యాభర్తల అరెస్టు

9 Jul, 2019 07:58 IST|Sakshi

సాక్షి, మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : ఇంటిపక్కవార్ని మచ్చిక చేసుకుని ఇంట్లోని బంగారు వస్తువులు కాజేసిన భార్యాభర్తలను సోమవారం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. పవన్‌కుమార్, రేవతి భార్యాభర్తలు. రేవతి తమ ఇంటి సమీపంలోని జీ. రవికుమార్‌ భార్యను మచ్చిక చేసుకుని విలువైన వస్తువులు, బంగారు నగలు, ఇంటి తాళాలు ఎక్కడ పెడుతున్నారో గమనిస్తూ ఉంది. సమయం కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా తస్కరించింది.

ఈనెల 5వ తేదీన ఇంట్లోని వస్తువులు మాయం అవ్వటం గమనించిన జీ రవికుమార్‌ దంపతులు అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ ఎస్‌వీవీఎల్‌ నారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నాను తాడు, చెవి దిద్దులు, రింగులు తదితర వస్తువుల విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని నిర్ణయించారు. విచారణ ప్రారంభించిన ఎస్‌ఐ సౌజన్య .. రవికుమార్‌ దంపతులను కలిసి ఎవరిమీదైనా అనుమానం ఉందా, ఇంటికి ఎవరెవరు వస్తుంటారు.. తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రేవతి దంపతులపై అనుమానం వచ్చింది. వారిపై నిఘా పెట్టగా సోమవారం రేవతి తన భర్తతో బంగారు నగలను తాకట్టు పెట్టేందుకు వెళ్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నందుకు సీఐ లక్ష్మీనారాయణ పోలీసులను అభినందించారు.  

మరిన్ని వార్తలు