అమ్మా.. కాలేజికి వెళ్తున్నా..

31 Jul, 2018 08:55 IST|Sakshi
రోదిస్తున్న తల్లి రామతీర్థమ్మ (ఇన్‌సెట్‌) నందన (ఫైల్‌ ఫొటో)

ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్‌ కడప): ఆ విద్యార్థినిది ఒక పల్లెటూరు.. ఆమెకు చిన్నప్పటి నుంచి వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చేసి రైతులకు సాయ పడాలని కోరిక. అయితే కుటుంబ సభ్యుల సలహా మేరకు విద్యార్థిని ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్‌ కాలేజీలో చేరింది. బలవంతంగా చదువును కొనసాగించడం తన వల్ల కాదని భావించి ఆమె తనువు చాలించింది. కన్నవారికి కన్నీరు మిగిల్చింది.

ప్రొద్దుటూరులో పాలిటెక్నిక్‌ చదువుతున్న అంగళ్లగుత్తి నందన (17) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మెస్‌లోని గోడకున్న పొడవాటి మేకుకు చున్నీ కట్టుకొని విద్యార్థిని ఉరివేసుకుంది. త్రీ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మండలం, ఉప్పరపల్లె గ్రామంలోని దళితవాడకు చెందిన  నాగేశ్వరరావు, రామతీర్థమ్మ దంపతులకు నందిని, నందన అనే కుమార్తెలతోపాటు నాని అనే కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె నందిని అనంతపురంలో రెండో సంవత్సరం పాలిటెక్నిక్‌ చదువుతుండగా, రెండో కుమార్తె నందన ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్‌ కాలేజిలో మొదటి సంవత్సరం ట్రిపుల్‌ఈ చదువుతోంది. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను చదువుకోకున్నా పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాగా చదివిస్తున్నాడు.

 
మెస్‌లో చేరి నెల కూడా కాలేదు..
నందన తోటి విద్యార్థులతో కలసి ఈ నెల 3న సరస్వతి విద్యామందిరం రోడ్డులో ఉన్న  లేడీస్‌ మెస్‌లో ఉంటోంది. రెండు రోజుల పాటు మెస్‌లో ఉన్న నందన తల్లిదండ్రులు రమ్మన్నారని ఊరికి వెళ్లింది. తిరిగి ఈ నెల 25న ఆమె తండ్రితో కలిసి ప్రొద్దుటూరుకు వచ్చింది. తండ్రి నాగేశ్వరరావు మెస్‌ ఫీజు రూ.2500 చెల్లించి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు సాయంత్రం నందన మళ్లీ మెస్‌ నుంచి ఊరికి వెళ్లింది. కొత్త కావడంతో కొన్ని రోజుల పాటు ఇలానే ఉంటుందని తల్లిదండ్రులు కుమార్తెతో చెప్పేవారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఇంటి వద్ద ఉన్న నందన తల్లిదండ్రుల సూచన మేరకు సోమవారం ఉదయం 9.30 సమయంలో మెస్‌కు వచ్చింది.

అప్పటికే మెస్‌లోని విద్యార్థులందరూ కాలేజికి వెళ్లగా తల నొప్పి కారణంతో ఒక విద్యార్థిని వరండాలో పడుకొని ఉంది. సుమారు 10.30 గంటల సమయంలో వరండాలో పడుకున్న విద్యార్థిని లోపలికి వెళ్లగా అప్పటికే నందన ఉరి తాడుకు వేలాడుతోంది.  ఆ  దృశ్యాన్ని చూసిన విద్యార్థిని గట్టిగా కేకలు వేస్తూ పరుగెత్తుకుంటూ బయటికి వచ్చింది. దీంతో మెస్‌ నిర్వాహకులు వెంటనే త్రీ టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ఓబులేసు, త్రీ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నందన ఊరి నుంచి వచ్చిన గంటలోపే ఈ దారుణానికి పాల్పడింది. కుమార్తె మృతి చెందిన విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు తెలపడంతో హుటాహుటిన వారు ప్రొద్దుటూరుకు వచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించసాగారు.

అమ్మా.. కాలేజికి వెళ్తున్నా..
సోమవారం ఉదయం నందన ఎక్కువ సేపు తల్లి వద్దనే గడిపింది. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దని, బాగా చదవాలని ఆమె సూచించారు. ప్రొద్దుటూరుకు వెళ్లగానే ఫోన్‌ చేయమని కుమార్తెతో చెప్పారు. ఉదయం 9.30 గంటలకు నందన  మెస్‌కు చేరుకుంది. వెంటనే మెస్‌ వద్ద ఉన్న కాలేజి విద్యార్థిని సెల్‌ఫోన్‌తో తల్లికి ఫోన్‌ చేసి ‘ఇప్పుడే మెస్‌కు వచ్చాను.. కాలేజికి వెళ్తున్నాను అమ్మా.. సాయంత్రం కాలేజి నుంచి వచ్చాక ఫోన్‌ చేస్తానని’ చెప్పింది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ తల్లి రామతీర్థమ్మ రోదిస్తోంది. నందనకు సెల్‌ఫోన్‌ వాడటం అలవాటు లేదు. అందువల్ల కాలేజి విద్యార్థులతో గానీ మెస్‌ వాళ్ల ఫోన్‌తో తల్లిదండ్రులతో మాట్లాడేది. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి విలపించసాగింది.

నందనకు పాలిటెక్నిక్‌ చదవడం ఇష్టం లేదని, అగ్రికల్చర్‌ కోర్సు చదవాలని చెబుతుండేదని కాలేజి విద్యార్థులు అన్నారు. ఈ కారణంతోనే కాలేజికి సరిగా వచ్చేది కాదని, మెస్‌లో కూడా ఎవ్వరితో మాట్లాడేది కాదని తెలిపారు. ఈ నెల 3న మెస్‌లో చేరినా ఎక్కువ రోజులు ఉండలేదని నిర్వాహకులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

మరిన్ని వార్తలు