వేధింపులు తట్టుకోలేక..

13 Dec, 2018 12:54 IST|Sakshi
కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్చకుడు ఫణికుమారాచార్యులు వీడియో సందేశమిస్తున్న అర్చకుడు

అర్చకుడి ఆత్మహత్యాయత్నం

వాట్సాప్‌ వీడియో మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు

హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

తూర్పుగోదావరి, రామచంద్రపురం: పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పనిచేసే అర్చకుడు ఆలయ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండల ఎం కోటపాడు గ్రామానికి చెందిన పాణింగపల్లి çఫణికుమారాచార్యులు ఏడాది కాలంగా ఆలయంలో అర్చకత్వం చేస్తున్నారు. ఈ ఆలయం ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో నడుస్తోంది. ఆలయ నిర్వాహకులు కొంత కాలంగా తనను వేధిస్తున్నారని, వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాని పేర్కొంటూ వాట్సాప్‌లో వీడియో మెసేజ్‌ పెట్టి ఎలుకల మందు సేవించాడు.

అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు హుటాహుటిన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో స్పందించిన రాష్ట్ర బ్రహ్మణ సంఘం నాయకులు దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రామచంద్రపురం ఎస్సై ఎస్‌ లక్ష్మిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయితే విషయం తెలుçసుకుని పోలీసులను కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి పంపామని, ఎంఎల్‌సీ అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వాడ్రేవు సాయిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

వీడియో మెసేజ్‌ సారాంశమిది
హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ యాజమాన్యం తనను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ హింసిస్తోందని, తాను చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ సూటిపోటి మాటలతో తనను నిర్వాహకులు బాధపెడుతున్నారని బాధితుడు వాట్సాప్‌ వీడియో సందేశంలో తన గోడు వినిపించాడు. ఇక తట్టుకోలేక మానసికంగా విసిగిపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనలా మరో వైఖానుసుడెవరూ బలికాకుండా చూస్తారని కోరుకుంటున్నాని తెలిపాడు. ఫణికుమారాచార్యులు పంపిన వాట్సాప్‌ వీడియో మెసేజ్‌ అందరినీ కలచివేసింది.

మరిన్ని వార్తలు