గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి

14 Apr, 2018 09:16 IST|Sakshi
వెంకటేశ్వరరావు(ఫైల్‌)

మరో రెండు నెలల్లో విడుదల ఉండగా దుర్ఘటన

సకాలంలో వైద్యం అందకనే మృతి అని బంధువుల ఆరోపణ

రాజమహేంద్రవరం క్రైం : గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నెహ్రూనగర్‌కు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు(41) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందాడు. ఉదయం ఆరు గంటలకు పెట్రోల్‌ బంక్‌లో పని చేసేందుకు వచ్చిన వెంకటేశ్వరరావు పది గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందని పెట్రోల్‌ బంక్‌లో పడిపోయాడు.

ఇతడిని సెంట్రల్‌ జైలులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.తన భార్య ఆత్మహత్య కేసులో ముద్దాయిగా ఉన్న మృతుడికి 2014 జనవరి 14న కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించడంతో  రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు శిక్ష నిమిత్తం వచ్చాడు.

సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌కు వేస్తారు. దీనిలో భాగంగా 2017 జనవరి ఏడో తేదీన ఓపెన్‌ ఎయిర్‌ జైలుకు వెంకటేశ్వరరావును మార్చారు. జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తుండేవాడు. సత్‌ ప్రవర్తన కలిగి ఉండేవాడు.  మృతుడు జైలుకు రాకముందు సెల్స్‌ టాక్స్‌ శాఖలో క్లర్కుగా పని చేయడంతో అకౌంట్లు బాగా రాసేవాడు.

దీంతో బంక్‌లోని రికార్డులు సక్రమంగా రాసేవాడని తోటి ఖైదీలు పేర్కొంటున్నారు. ఎంతో సౌమ్ముడిగా ఉండే వెంకటేశ్వరరావు అకాల మృతికి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన బావమరిదిని సకాలంలో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని మృతుడి బావ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

రాజమహేంద్రవరం అర్బన్‌ తహసీల్దార్‌ రాజేశ్వరరావు, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ గిరీష్‌ పంచనామా నిర్వహించారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరో రెండు నెలలో విడుదల ఉండగా..

సత్‌ ప్రవర్తనతో ఉండే వెంకటేశ్వరరావు మరో రెండునెలలో విడుదల అవుతాడనగా ఆకస్మికంగా మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. సకాలంలో వైద్య సదుపాయం అందక మృతి చెందాడని పేర్కొంటున్నారు.

చికిత్స అందించడంలో జాప్యం లేదు

జైలులో చికిత్స అందించడంలో జాప్యం చేయలేదు. ఉదయం బీపీ డౌన్‌ అయ్యిందని జైలులో ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే జైలు వైద్యులు చికిత్స అందించారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంలో అంబులెన్స్‌తో హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ఖైదీకి వైద్య చికిత్సలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగలేదు.    – రఘు, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు