ఆర్జీవీ విచారణ వాయిదా

24 Feb, 2018 02:29 IST|Sakshi
రామ్‌ గోపాల్‌ వర్మ(తాజా చిత్రం)

‘జీఎస్టీ’కేసులో నిర్ణయించిన నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద అశ్లీల వెబ్‌ సిరీస్‌ ‘జీఎస్టీ’పై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) విచారణ వాయిదా పడింది. ఇప్పటికే ఓసారి సైబర్‌ క్రైమ్‌ పోలీసుల విచారణను ఎదుర్కొన్న ఆయన శుక్రవారం రెండోసారి హాజరుకావాల్సి ఉంది. తొలి రోజు విచారణలో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపించిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించారు.

ఈలోపు జీఎస్టీకి వర్మకు ఉన్న సంబంధాలను ఆరా తీసేందుకు ఈ వెబ్‌ సిరీస్‌కు పనిచేసిన మరికొందరిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణలో తగిన ఆధారాలు లభిస్తే వర్మను అరెస్టు చేయాలా? లేక న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసి కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలా? అనే అంశంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నిస్తే మరిన్ని కీలకాంశాలు రాబట్టడంతో పాటుగా తదుపరి చర్యలు తీసుకోవానికి ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు