విధులకు వెళ్తూ.. అనంతలోకాలకు

23 Aug, 2018 12:09 IST|Sakshi
శశికాంత్‌ మృతదేహం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ద్విచక్రవాహనంపై డ్యూటీకి వెళ్తున్న క్రమంలో ఆగిఉన్న లారీని ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం చెందాడు. గోదావరిఖని టూటౌన్‌ సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఎస్సీటూ 272 క్వార్టర్‌లో నివాసముంటున్న రాపెల్లి శశికాంత్‌(25)అనే సింగరేణి ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం రాత్రి షిఫ్టు విధులకు యైటింక్లయిన్‌కాలనీ నుంచి జీడీకే–1వ గనికి వెళ్తున్న క్రమంలో పెంచికల్‌పేట్‌ రైల్వే గేట్‌ సమీపంలోని గోదావరిఖని ప్రధాన రోడ్డుపై  నిలిపిఉంచిన లారీని వెనకనుంచి ఢీకొట్టాడు. దీంతో శశికాంత్‌ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అదే సమయంలో డ్యూటీకి వెళ్తున్న తోటి ఉద్యోగులు గుర్తించి ఆసుపత్రి తరలించేలోపే మార్గంమధ్యంలో మృతి చెందాడు.
 
హెల్మెట్‌ ఉన్నా దక్కని ప్రాణాలు.. 
డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శశికాంత్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ ఎదురుగా నిలిచి ఉన్న వాహనాన్ని గమనించక బలంగా ఢీకొట్టడంతో హెల్మెట్‌ సైతం పగిలిపోయి తలకు తీవ్ర గాయాలై ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు.

గతేడాదే ఉద్యోగం.. 
సిరిసిల్ల పట్టణానికి చెందిన శశికాంత్‌ గతేడాది సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని సాధించాడు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–1గనిలో ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి పూట రోడ్డు పక్కన లారీ నిలిపి ఉంచడం ఆప్రాంతం చీకటిమయంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగి నిండుప్రాణం పోయిందని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడి తండ్రి రాపెల్లి దేవదాసు ఫిర్యాదుతో గోదావరిఖని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు