చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌

12 Nov, 2018 10:54 IST|Sakshi
అదృశ్యమైన సునిత, పిల్లలు

యజమాని భార్య ముగ్గురు

పిల్లలతో సహా అదృశ్యం

రాంగోపాల్‌పేట్‌: గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రెజిమెంటల్‌బజార్‌లో ఈ నెల 9న ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసు మలుపు తిరిగింది. ఇంట్లోని వారందరు దీపావళి పండుగకు వెళితే దొంగలు తాళాలు పగలగొట్టి రూ.11 లక్షల నగదు, మూడున్నర తులాల బంగారు ఆబరణాలు అపహరించుకుని పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు వివిధ కోణాల్లో ధర్యాప్తు చేస్తుండగా ఇంటి యజమాని భార్య సునిత (32) తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైంది. 9వ తేదీన దొంగతనం విషయం తెలియగానే అడ్డగుట్టలో ఉన్న వేణుగోపాల్, ఆయన భార్య రెజిమెంటల్‌బజార్‌లో ఇంటికి వచ్చారు. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వేణుగోపాల్‌ భార్య సునీత అక్కడ స్పృహ తప్పిపడిపోయింది.

వెంటనే స్థానికులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇంటికివచ్చిన ఆమె ఈ నెల 10న తన ముగ్గురు పిల్లలు నమ్రత (8), లేఖశ్రీ (6), సాత్విక (4)లతో సహా అదృశ్యమైంది.  గత మూడు నెలల నుంచి వేణుగోపాల్‌కు వరుసకు సోదరుడు అయ్యే సాయి (28) అనే వ్యక్తి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాడు. వీరితో పాటు ఆయన కూడా అదృశ్యమయ్యాడు. దొంగతనం జరుగడం, ఆ వెంటనే ఇంటి యజమాని భార్య అదృశ్యమైపోవడంతో పోలీసులు ఇప్పుడు ఈ దొంగతనం ఇంటి దొంగల పనేనా అనే కోణంలో విచారిస్తున్నారు. దొంగతనం జరిగినపుడు కూడా డాగ్‌ స్క్వాడ్‌ గుర్తించకూడదనే ఉద్దేశ్యంతో ఇంట్లో కారంపొడిన చల్లారు. అప్పుడే పోలీసులు ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందనే అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఇందులో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలాగే పిల్లలతో సహా అదృశ్యమైన సునిత ఆచూకీ లభిస్తే కానీ దొంగతనం కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదు. 

మరిన్ని వార్తలు