మహేష్‌ది ఆత్మహత్యే

27 Jul, 2018 12:11 IST|Sakshi
మహేష్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు

తండ్రిని అనుసరించబోయి ప్రాణాలు కోల్పోయిన కుమారుడు

ముషీరాబాద్‌: భోలక్‌పూర్‌ డివిజన్‌ పద్మశాలి కాలనీలోని లిటిల్‌ ఫ్లవర్స్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న మహేష్‌ మరణంపై  అనుమానాలు వీడాయి. మహేష్‌ చీరతో ఉరివేసుకోవడం వల్లనే మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. స్కూల్‌ యాజమాన్యం ఫీజుల కోసం వేధించినందునే మహేష్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి, బాలల హక్కుల సంఘాలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో గురువారం మహేష్‌ భౌతికకాయానికి గాంధీ మార్చురీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీశారు. అనంతరం ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మెడపై ఉరివేసుకున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. మహేష్‌ భౌతికకాయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

తండ్రిని అనుసరించబోయి...
12ఏళ్ల విద్యార్థికి 6అడుగుల ఎత్తులో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకోవడం ఎలా సాధ్యమని అనుమానాలు రేకెత్తాయి.  పాఠశాల యాజమాన్యం రూ.5,600 ఫీజు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో రెండు రోజులుగా అతను స్కూలుకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు. దీంతో ఇంటికెందుకు వచ్చావని తండ్రి కొట్టడంతో మనస్తాపానికి లోనైన మహేష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కొద్ది నెలల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో మహేష్‌ తండ్రి శ్రీనివాస్‌ భార్యను బెదిరించేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడని, దీంతో పిల్లలు బిగ్గరగా ఏడుస్తూ వద్దని వారించినట్లు చెప్పిన శ్రీనివాస్‌ బోరున విలపించాడు. తాను ఆనాడు బెదిరించేందుకు చేశానని, తన కుమారుడు తనను  అనుకరించి నిజంగానే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు