‘కన్న బిడ్డను తల్లి చంపడం అసహజం’

27 Dec, 2019 17:56 IST|Sakshi

న్యూఢిల్లీ: జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే బిడ్డకు ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందన్న ఆరోపణల నుంచి సుప్రీంకోర్టు ఓ తల్లికి విముక్తి కల్పించింది. కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి చంపజాలదని, ఇది పూర్తిగా అసహజమైందని వ్యాఖ్యానిస్తూ ఆ తల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. నిందితురాలు 2007 ఆగస్టు 24న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో బాలికకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన కొద్దిసేపటికే బిడ్డ చనిపోవడంతో తల్లిపై కేసు నమోదైంది. 2009 ఆమెకు ట్రయల్‌ కోర్టు జీవితఖైదు వేసింది. ఆమె హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సైతం అదే శిక్షను సమర్ధించింది. దీంతో ఆమె సర్వోన్నత న్యాయస్థానం తలపుతట్టింది. జస్టిస్‌ ఎం.ఎం.శాంతనూ గౌండర్, జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డిల బెంచ్‌ ఈ కేసును విచారించింది. సాక్ష్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆ తల్లే బిడ్డను చంపిందనేందుకు ఆధారాలు లేవంటూ తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పింది.

మరిన్ని వార్తలు