ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉద్రిక్తత

1 Aug, 2018 08:28 IST|Sakshi
కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలంటూ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన ఫిర్యాదుతో వివిధ రాజకీయ పా ర్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కమి షనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు పోలీసులు కమిషనర్‌పై ఎస్సీ,ఎస్టీ కేసు, అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు.

ఎర్రగుంట్ల (వైఎస్సార్‌ కడప): ఎర్రగుంట్ల మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనపై కమిషనర్‌ విజయసింహారెడ్డి అత్యాచారానికి ప్రయత్నించారని పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్‌.వసంత వాపోయింది. ఆమెకు న్యాయం చేయాలని తోటి కార్మికులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎస్‌.వసంత పని చేస్తున్నారు.

మంగళవారం ఉదయం 7.30 గంటలకు కమిషనర్‌ ఇంటి వద్ద పని చేయడానికి మేస్త్రీ అయిన నర్సింహరెడ్డి ద్వారా పిలవడం జరిగింది. దీంతో కమిషనర్‌ ఇంటి వద్దకు ఆమె వెళ్లింది. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత.. బెడ్‌ రూమ్‌లో శుభ్రం చేస్తుండగా కమిషనర్‌ వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను చెప్పినట్టు వింటే నీకు ఏమి కావాలన్నా ఇస్తాను’ అని లొంగదీసుకోవడానికి బలవంతంగా లాగారని వాపోయింది. తాను గట్టిగా కమిషనర్‌ను వెనక్కి నెట్టి పరుగెత్తుకుంటూ మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి తోటి కార్మికులకు జరిగిన విషయం తెలిపానని వివరించింది.

మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయింపు
మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో ఈ విషయం మాట్లాడటానికి కార్మికులు ప్రయత్నించారు. అయితే అధికారులు బెదగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యానారాయణరెడ్డి, పద్మనాభయ్య, నాగన్న, కడప పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, వర్రా డెవిడ్, నాయకులు దివాకర్‌రెడ్డి, షర్పుద్దీన్, మహుబూబ్‌వలి, బీజేపీ నాయకుడు నాగరాజు, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.గంగిరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు ఎస్‌.మంజుల, ఏఐటీయూసీ నాయకులు ఎం.నారాయణ అక్కడికి చేరుకున్నారు. కార్మికులతోపాటు వారు మున్సిపల్‌ కార్యాలయం  ఎదుట ధర్నాకు దిగారు.

అంతకుమునుపు బాధితురాలికి మద్దతుగా మున్సిపల్‌ చైర్మన్‌ ముసలయ్య నిలిచారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కమిషనర్‌ను ప్రత్యేక వాహనంలో కార్యాలయం నుంచి బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మికులు రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో రోడ్డుపై బైఠాయించారు. తర్వాత పోలీసులు కమిషనర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐలు మారెన్న, చిరంజీవి, క్రిష్ణయ్య, మహమ్మద్‌ రఫీలు ఆందోళనను అదుపు చేశారు. ఆందోళనకారులు బాధితురాలు వసంతతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కమిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 354–ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మారెన్న తెలిపారు.

డీఎస్పీ విచారణ
కడప డీఎస్పీ మాసూంబాషా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, సీ పీఐ నాయకురాలు మంజుల డీఎస్పీని కలిసి కోరారు.
కమిషనర్‌ ఏమంటున్నారంటే..
ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ విజయసిం హారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తనపై నిందా ఆరోపణలు వేస్తున్నారన్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ స మావేశంలో జీఓ 279ను ఆమోదం చేయాలని అజెం డాలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఈ జీ వో అమలులోకి వస్తే ఉద్యోగ భద్రత ఉండదని నెపం తో కార్మికులు తన పైన నిందలు వేస్తున్నారని చెప్పా రు. తాను కార్మికులను బలవంతం చేయలేదన్నారు.
 
కమిషనర్‌ బదిలీ
ఎర్రగుంట్ల మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తనను బదిలీ చేయాలని ఆయన రెండు వారాల క్రితం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

మరిన్ని వార్తలు