ఉలిక్కిపడ్డ పారిస్‌

13 May, 2018 08:07 IST|Sakshi

పారిస్‌: ఉగ్ర దాడితో ఫ్రాన్స్‌ ఉలిక్కిపడింది. ఓ ఉగ్రవాది పౌరులపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి సెంట్రల్‌ ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, గాయాలతో మరో నలుగురు ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరపటంతో ఉగ్రవాది హతమయ్యాడు.

ఓపెరా హౌజ్..  బార్లు, రెస్టారెంట్లతో నిత్యం కిటకిటలాడుతుంటుంది‌. వారాంతం కావటంతో జనాలు పెద్ద ఎత్తున్న ఆ ప్రాంతంలో గుమిగూడారు. ఇంతలో ఓ వ్యక్తి అల్లాహూ అక్బర్‌ నినాదాలు చేస్తూ కనిపించినవారినల్లా గాయపరచటం ప్రారంభించాడు. పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా, జనసందోహం ఎక్కువగా ఉండటంతో అది వీలు కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఉగ్రవాదిని కాల్చి చంపాయి. 

కాగా, ఘటనకు తామే కారణమంటూ ఐసిస్‌ ప్రకటించుకుంది. ఉగ్రదాడిపై అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్‌ మాక్రోన్‌ ట్వీట్‌ చేశారు. ‘ఫ్రాన్స్‌ మరోసారి నెత్తురు చిందించింది. కానీ, శత్రువులకు ఇంచుకూడా అవకాశం ఇవ్వలేదు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌ తరచూ ఉగ్రదాడులకు నిలయంగా మారింది. 2015 నవంబర్‌ 13న చోటు చేసుకున్న మారణహోమంలో 130 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు