కారంపొడి చల్లి.. కర్రలతో దాడి

11 Mar, 2020 03:00 IST|Sakshi

వివాహిత ఆత్మహత్య.. కోపోద్రిక్తులైన తండావాసులు  

అడ్డుకున్న పోలీసులపై దాడికి యత్నం

నిందితుల ఇళ్ల ధ్వంసం 

నిజామాబాద్‌ జిల్లా గుట్టకింది తండాలో ఉద్రిక్తత  

ఇందల్‌వాయి/ధర్పల్లి: (నిజామాబాద్‌ రూరల్‌): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కలసి నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై కారం పొడి చల్లి.. కర్రలతో దాడి చేశారు. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి యత్నించడంతో లాఠీచార్జి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మంజుల (22)కు గుట్టకింది తండాకు చెందిన లావుడ్య గణేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది.

మంజుల ప్రవర్తన బాగోలేదని ఐదు రోజుల క్రితం గణేష్‌ ఆమెను మందలించాడు. కలత చెందిన మంజుల ఎవరికీ చెప్పకుండా తిరుపతికి వెళ్లింది. తమ కూతురు కనిపించడం లేదని మంజుల తల్లిదండ్రులు ఈ నెల 7న ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. మంజుల తిరుపతి నుంచి తన భర్త మిత్రుడైన గోపాల్‌తో మాట్లాడింది. ఫోన్‌ నంబరు ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లారు. ఇంతలోనే మంజుల స్వయంగా సోమవారం సాయంత్రం డీబీ తండాకు చేరుకుంది. ఇంటికి వెళ్లని ఆమెను మంగళవారం వేకువజామున పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్‌ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు.

మరోవైపు డీబీ తండా నుంచి 200 మంది మహిళలు మంగళవారం మధ్యాహ్నం డీసీఎం వ్యానులో గుట్టకింది తండాకు బయలు దేరారు. ముందస్తు సమాచారంతో పోలీసులు వారి వాహనాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు. అయితే మహిళలు కారం పొడి, కర్రలు పట్టుకుని కాలినడకన గుట్టకింది తండాకు చేరుకున్నారు. పోలీసులను తోసేసి గణేష్, గోపాల్‌ ఇళ్లపై దాడి చేసి ఫర్నిచర్, తలుపులను ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో మహిళా పోలీసులపై దాడి జరగడంతో లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇన్‌చార్జి ఏసీపీ ప్రభాకర్, అడిషనల్‌ డీజీపీలు ఉషా విశ్వనాథ్, రఘవీర్‌లు గుట్టకింది తండాకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మంజుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. గోపాల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. గుట్టకింది తండాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పోలీసులపై దాడి చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా